
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. ఈ ఆదివారం కూడా మంగమ్మతల్లి గుడి భక్తులతో కిటకిటలాడింది.
మహిళ అదృశ్యంపై
కేసు నమోదు
కాళ్ల: భార్య కనిపించడం లేదంటూ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కాళ్ల పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కాళ్ళకూరు గ్రామానికి చెందిన పి.దివ్య(27) తన కుమారుడు మనోహర్షిత్‌తో కలిసి ఈ నెల 10న ఉదయం భీమవరంలోని కేజీఆర్‌ఎల్ కళాశాలకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి రాకపోవడంతో భర్త భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.