
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
బుట్టాయగూడెం: వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం చేయక తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో ఆ సంఘం ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యలపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం వర్జీనియా పొగాకు సరాసరి కిలోకు రూ.330 వరకూ వచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు, కౌలు రేట్లు బాగా పెరిగాయని అన్నారు. అయితే గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది మార్కెట్ ధర ఉండే పరిస్థితి కనిపించడంలేదన్నారు. ఇప్పటికే వైట్ బార్లీ పొగాకు కొనుగోలు చేయడం లేదని చెప్పారు. వర్జీనియా పొగాకు రైతులకు తగిన ధర కల్పించేలా బోర్డు అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సిరిబత్తుల సీతారామయ్య, బొడ్డు రాంబాబు, బిక్కిన వీరసత్యం, సింహాద్రి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.