
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పెనుగొండ: వడలి పిట్టల వేమవరం రహదారిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం పెనుగొండకు చెందిన తడివాడ భార్గవ్ (17) స్నేహితుడు ఇళ్ల నంద కిషోర్‌తో కలసి మోటార్‌సైకిల్‌పై వడలి పిట్టల వేమవరం రహదారిలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ టచ్ అవ్వడంతో మోటారుసైకిల్ రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్గవ్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నందకిషోర్‌కు గాయాలు కావడంతో తణుకు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పెనుగొండ ఎస్సై కే గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటికి రంగులు వేస్తూ జారిపడి వ్యక్తి మృతి
భీమవరం: ఇంటికి రంగులు వేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతిచెందినట్లు వన్‌టౌన్ ఏఎస్సై బాజి బుధవారం చెప్పారు. పట్టణంలోని మారుతీ నగర్‌లో ఇళ్ల వేణుగోపాల్ ఇంటికి రంగులు వేయడానికి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కురెళ్ల తాతారావు(56) వచ్చాడు. రంగులు వేస్తుండగా తాడు జారి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తాతారావు అల్లుడు జవ్వాది సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బాజి చెప్పారు.
జాతీయ వెయిట్ లిఫ్టింగ్‌లో కీర్తనకు రజతం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరంలోని ఏఆర్‌డీజీకే పాఠశాల విద్యార్థిని చుక్క కీర్తన రజత పతకం సాధించింది. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకూ మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కీర్తన 59 కేజీల విభాగంలో స్నాచ్‌లో 67 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 87 కిలోలు కలిపి మొత్తం 154 కిలోలు ఎత్తి రజత పతకం సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డీ. షారోన్ తెలిపారు. అలాగే తమ పాఠశాలకు చెందిన మొయిద పావని 40 కేజీల విభాగంలో స్నాచ్‌లో 47 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 55 కిలోలు మొత్తం 102 కిలోల బరువు ఎత్తి 4వ స్థానంలో నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి పతకాలు సాధించిన విద్యార్థినిలను, ఫిజికల్ డైరెక్టర్ పీ పుల్లారావును బుధవారం పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ ఉపాధ్యాయులు వీ కాంతి జయకుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈడే శివశంకర రావు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి