
కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
కై కలూరు: కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇటీవల కొల్లేరు సమస్యపై సుప్రీంకోర్టు 12 వారాల గడువు ఇవ్వడంపై వడ్డీ సాధికారిత రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు అధ్యక్షతన కై కలూరు ట్రావెలర్స్ బంగ్లాలో ఏలూరు జిల్లా కొల్లేరు పెద్దలతో సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ)ని సుప్రీంకోర్టు క్షేత్రస్థాయిలో కొల్లేరు సమస్యపై నివేదిక కోరిందన్నారు. త్వరలో సీఈసీ సభ్యులు కొల్లేరు అధ్యయనానికి వస్తారన్నారు. ఆయా గ్రామాల ప్రజలు అర్జీలతో సమస్య చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పర్యావరణంతో పాటు ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలనే వాదాన్ని ప్రజాప్రతినిధులందరూ తెలుపుతున్నామన్నారు. కొల్లేరు అభయారణ్య విస్తీర్ణం 77,535 ఎకరాలను 55,000గా నిర్ణయించి మిగిలినవి కొల్లేరు పేదలకు పంపిణీ జరిగేలా కృషి చేస్తామన్నారు. కొల్లేరు తరపున సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ చేపల రైతుల సంఘం దాఖలు చేసిందని, దాంతో పాటు కొల్లేరు సంఘాల తరుపున ఇంప్లీడ్‌కు అవకాశం కల్పించాలని నాయకులు కోరారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు వడ్డీల సాధికారిత కన్వీనర్ బలే ఏసురాజు, సాహితీవేత్త వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.