
పోగొట్టుకున్న బ్రాస్‌లెట్ భక్తుడికి అప్పగింత
జంగారెడ్డిగూడెం: ఆలయ పరిసరాల్లో పొగొట్టుకున్న బంగారు బ్రాస్‌లెట్‌ను సోమవారం బాధితుడికి నూకాలమ్మ ఆలయ కమిటీ అందజేసింది. మూడు రోజుల క్రితం కొప్పుల దుర్గాప్రసాద్, అశ్విని దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళుతున్న సమయంలో చేతికి ఉన్న బ్రాస్‌లెట్ కనిపించకపోవడంతో ఆలయ కమిటీకి తెలియజేసి దొరికితే ఇప్పించాలని దుర్గాప్రసాద్ కోరాడు. ఆలయ సమీపంలో నివసించే మహాలక్ష్మికి ఈ బ్రాస్‌లెట్ దొరకగా ఎవరిదో విచారించి వారికి ఇవ్వాలని ఆలయ కమిటీని కోరింది. సోమవారం దుర్గాప్రసాద్ దంపతులకు మహాలక్ష్మి చేతుల మీదుగా బ్రాస్‌లెట్‌ను ఆలయ కమిటీ అందజేసింది. మహాలక్ష్మిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు. కాగా బ్రాస్‌లెట్ విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది.
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు
దెందులూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో దళిత కుటుంబాన్ని పెత్తందారులు సామాజిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటని దళిత ప్రజాప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సర్క్యూట్ వల్ల దళితుడు సురేష్ మృతి చెందడం, అతనికి న్యాయం చేయాలని దళితులు, గ్రామస్తులు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం నేరమా అని ప్రశ్నించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా బాధిత కుటుంబాన్ని పవన్‌కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి దేశమంతా తలెత్తుకొని చూసేలా చేస్తానని అన్ని మీటింగ్‌లో చెప్పారని, దాని అర్థం ఇదేనా అని దళిత ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. దళిత కుటుంబాన్ని వెలివేసిన వారిని, ఇందుకు సహకరించిన వారిని జిల్లా బహిష్కరణ చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా ఈ ఘటనపై పవన్‌కళ్యాణ్ చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తామని దళిత ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఏలూరు జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తెర ఆనంద్, ఫారెస్ట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పల్లం ప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు మోరు రామరాజు, పార్టీ జిల్లా కార్యదర్శులు గొల్ల కిరణ్ దేవదాసు ప్రేమ్ బాబు ఉన్నారు.