బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరి | - | Sakshi
Sakshi News home page

బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరి

Published Tue, Apr 29 2025 12:34 AM | Last Updated on Tue, Apr 29 2025 12:34 AM

బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరి

బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరి

నూజివీడు: ట్రిపుల్‌ఐటీ.. ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే విద్యాసంస్థ. అయితే ఇందులో పనిచేసే బోధనా సిబ్బందికి బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరిపోతోంది. ట్రిపుల్‌ ఐటీలో పర్మినెంట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, మెంటార్లు, ఐటీ మెంటార్లు పీయూసీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. వీరిలో కొందరికి పలు అదనపు బాధ్యతలను అప్పగించారు. తెలుగు డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఏకంగా ముగ్గురికి అదనపు బాధ్యతలను అప్పగించడంతో వారు నిత్యం అదనపు బాధ్యతల్లోనే మునిగి తేలుతున్నారు. క్యాంపస్‌ మెయింట్‌నెన్స్‌ ఇన్‌చార్జిగా తెలుగు మెంటార్‌ ఓ శ్రీహరికి అప్పగించారు. ఈయన సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్‌, గార్డెనింగ్‌, గెస్ట్‌హౌస్‌ల మెయింట్‌నెన్స్‌ను చూసుకుంటున్నారు. మూడు షిఫ్టులలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది విషయాలతో పాటు హౌస్‌కీపింగ్‌, గార్డెనింగ్‌ సిబ్బంది వ్యవహారాలు చూసుకోవడంతోనే ఉన్న సమయం కాస్తా సరిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే తెలుగు సబ్జెక్టు బోధించే కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లలో జడ సీతాపతికి డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌(బాలుర) బాధ్యతలను, పీ లక్ష్మణరావుకు బాలుర చీఫ్‌ వార్డెన్‌ బాధ్యతలను అప్పగించారు. ఇలా ఒకే సబ్జెక్టుకు చెందిన ముగ్గురు బోధన సిబ్బందిని అదనపు బాధ్యతల్లో నియమిస్తే ఆ సబ్జెక్టులో విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా ఏడాదికో ఫ్యాకల్టీ

ట్రిపుల్‌ఈ విద్యార్థులకు పాఠాలు బోధించే శ్రీనాథ్‌కు ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో ఏడీ స్థాయి అధికారిని డిప్యూటేషన్‌పై నియమించుకోవాలని ట్రిపుల్‌ ఐటీకి సంబంధించిన యాక్ట్‌–18లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అదేమీ పాటించకుండా ఏడాదికొక ఫ్యాకల్టీని ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా నియమిస్తున్నారు. సెంట్రల్‌ డీన్‌, సెంట్రల్‌ ఏఓ, ఏఓ, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ అంటూ కొందరిని నియమించారు. మరికొందరికి మెస్‌ల ఇన్‌చార్జిలుగాను బాలికల హాస్టళ్లకు చీఫ్‌ వార్డెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇలా అత్యధిక మంది నిరంతరం అదనపు బాధ్యతల్లోనే మునిగి తేలుతుండటంతో బోధన కొంతమేరకు కుంటుపడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదనపు బాధ్యతలు ఉన్న కొందరు వీటిని సాకుగా చూపించి పరీక్షల సమయంలో ఇన్విజిలేషన్‌ను సైతం తప్పించుకుంటున్నారు. మరికొందరైతే డబ్బులు వచ్చే సెమిస్టర్‌ పరీక్షలకు ఇన్విజిలేషన్‌ వేయించుకుంటూ డబ్బులు రాని మిడ్‌ పరీక్షల ఇన్విజిలేషన్‌కు దూరంగా ఉంటున్నారు.

కొన్ని బ్రాంచిలకు ఫ్యాకల్టీ తక్కువ

మెకానికల్‌ బ్రాంచికి సంబంధించి నాలుగు సంవత్సరాలకు సంబంధంచి 240 మంది విద్యార్థులకు 11 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచిలకు 1,440 మంది చొప్పున విద్యార్థులండగా సీఎస్‌ఈకి 20 మంది, ఈసీఈకి 15 మంది మాత్రమే ఫ్యాకల్టీ ఉన్నారు. కెమికల్‌కు 240 మందికి ఏడుగురు, ట్రిపుల్‌ ఈ కి 480 మందికి 14 మంది, సివిల్‌కు 240 మందికి 13 మంది, మెటలర్జీకి 240 మందికి ఐదుగురు ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు. దీంతో కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా పనిభారం ఉండటం జరుగుతోంది. వీటన్నింటిని సరిదిద్ది విద్యార్థులకు మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం ట్రిపుల్‌ ఐటీ వర్గాల్లోనే వినిపిస్తోంది.

తెలుగు డిపార్ట్‌మెంట్‌లోనే ముగ్గురికి అదనపు బాధ్యతలు

ఫ్యాకల్టీల్లో కొందరికి ఎక్కువ పనిభారం

ట్రిపుల్‌ ఐటీలో కుంటుపడుతున్న బోధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement