ప్రపంచంలోనే అత్యంత వృద్ధ స్లాత్ పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూపార్కులో కన్నుమూసింది. 54 ఏళ్ల ఈ స్లోత్‌ను జాన్ అని పిలిచేవారు. అది గత వారం కన్నుమూసినట్లు జూ తెలిపింది. 1969లో పుట్టిన జాన్ తొలుత హాంబర్గ్ జూలో నివసించింది. తర్వాత క్రెఫెల్డ్ జూకు మారి 38 ఏళ్లుగా అక్కడే గడిపింది. మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వృద్ధ స్లోత్‌గా 2021లో గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మగ స్లోత్‌కు 22 మంది సంతానం. ఏటా ఏప్రిల్ 30న దాని పుట్టిన రోజు సంబరాలు అట్టహాసంగా జరిగేవి. స్లోత్‌ల జీవితకాలం 30 నుంచి 40 ఏళ్లు.
బద్ధకానికి మారుపేరు!
స్లోత్‌ను అత్యంత బద్ధకస్తురాలైన జీవిగా చెబుతారు. ఇది క్షీరదం. వీటిలో ఆరు రకాలుంటాయి. అన్నీ చెట్ల కొమ్మల మీదే నివసిస్తాయి. మరో చెట్టుపైకి వెళ్లడానికి మాత్రమే కిందకు దిగుతాయి. నేలపై నిమిషానికి కేవలం ఐదడుగుల వేగంతో, చెట్లపైనైతే 15 అడుగుల వేగంతో కదులుతాయి. చూట్టానికి ఎలుగుబంటికి దగ్గరగా, అందంగా ఉంటాయి. ఆకులు, పళ్లు తింటాయి. చెట్ల రసాలు తాగుతాయి. అన్నట్టూ, వీటి జీర్ణ వ్యవస్థ కూడా అత్యంత నెమ్మదిగా పని చేస్తుందట!
Comments
Please login to add a commentAdd a comment