
ఇస్మార్ట్ బామ్మ!
చిన్నతనంలో విన్న పద్యాలు, పౌరాణిక నాటకాలు చూసిన ఆమెకు తాను అలా పాడాలని.. నాటకాల్లో నటించాలని కోరిక ఉండేది. ‘ఆ బంగారు కాలం ఎటుబాయే’ అని బాధపడే గౌరమ్మకు స్మార్ట్‌ఫోన్ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. తన మనవరాలి సాయంతో ఫోన్‌లో రీల్స్ చేస్తూ వేల మంది ఫాలోవర్స్‌ను సంపాదించి..
పలువురిచేత ఔరా
అనిపించుకుంటోంది.
–రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రేణిగుంట గ్రామానికి చెందిన రంగ గౌరమ్మ, ఆమె భర్త భిక్షపతి నిరక్షరాసులు. వ్యవసాయ కూలి పనులే వారికి జీవనాధారం. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు సెల్‌ఫోన్ ప్రపంచంలో తలమునకలవుతూ ఈ ప్రపంచాన్నే మరిచిపోవడాన్ని ఎన్నోసార్లు గమనించింది గౌరమ్మ. సెల్‌ఫోన్‌లో ఎన్నో యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూసింది. అవి చూసినప్పుడల్లా తనలోని కళాకారిణి మేల్కొనేది. ‘బావా ఎపుడు వచ్చితీవు’ ‘చెల్లియో చెల్లకో‘ ‘ఎక్కడ నుండి రాక’ ‘జెండాపై కపిరాజు’.. ఇలా ఎన్నో పద్యాలు తన చిన్నప్పటి రోజుల్లో విన్నది. సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానం, శ్రీరామంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, నర్తనశాల.. ఇలా ఎన్నో పౌరాణిక నాటకాలు చూసింది. పద్యాలు విన్నప్పుడల్లా.. తానూ పాడేది. నాటకాలు చూసినప్పుడల్లా తనకు కూడా వేదిక ఎక్కి నటించాలని ఉండేది. కానీ, ఎవరు ఏమంటారో అనే భయంతో నటించాలనే కోరిక తనలోనే ఉండిపోయేది.
ప్రశంసలతో
మరింత ఉత్సాహం
గత కాలాన్ని కళ్ల ముందుకు తీసుకొస్తున్న సెల్‌ఫోన్‌ను కొనాలని గౌరమ్మ నిర్ణయించుకుంది. అక్క మనుమరాలు రీతిక, మేనకోడలు మౌనిక ప్రోత్సాహంతో స్మార్ట్ ఫోన్ కొని వినియోగిస్తుంది. వారి ద్వారా ఫోన్ ఎలా వాడాలో నేర్చుకుంది. చిన్న చిన్న వీడియోలు తీయడం, రీల్స్ తీస్తు.. తాను చేసిన వీడియోలను గత సంవత్సరం నుంచి యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసేంది. ఆ వీడియోలు చూసి మొదట ఊరి వాళ్లు, చుట్టాలు పక్కాలు ‘మన గౌరమ్మేనా!’ అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అభినందించారు. వారి అభినందనలు, ప్రశంసలు తనకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. చుట్టుపక్కల ఊరి వాళ్లు కూడా తనను గుర్తు పట్టి ప్రశంస పూర్వకంగా మాట్లాడేవారు. గౌరమ్మ చేసిన పోస్టులకు లైకులు రావడం, సబ్‌స్కైబర్లు పెరగడం మొదలైంది.
క్లీన్ అండ్ గ్రీన్ షార్ట్స్
పద్ధతిగా వీడియోలు చేస్తూ ‘భేష్’ అనిపించుకుంటుంది గౌరమ్మ. జాతరలు, దేవాలయాల దర్శనం, పెళ్లిళ్లు, పేరంటాలు, పిల్లలను తొట్టెల్లో వేయడం, వ్యవసాయ పనులు చేసే కూలీలు, వరి నాట్లు వేయడం, ముగ్గులు వేసే మహిళలు.. ఇలా తనకు తోచినట్టుగా రీల్స్ చేస్తూ వచ్చింది. ఇప్పటివరకు మొత్తం 1500 వరకు పోస్టులు చేయగా 8,831 మంది ఫాలోవర్స్ ఉన్నారు. గౌరమ్మ చేస్తున్న ‘రీల్స్’ ప్రాచుర్యం పొందడంతో ఆమె పేరు కాస్త ‘ఇన్‌స్టాగ్రామ్ గౌరమ్మ’గా మారింది.
మెచ్చుకోవడం సంతోషంగా ఉంది
యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్’ చూసిన తరువాత నాకు కూడా ఏదైనా చేయాలనిపించింది. అక్షరం ముక్క రాకపోయినా చాలా బాగా వీడియోలు చేసి ఎంతోమంది చేత ‘శభాష్’ అనిపించుకుంటున్న వారిని యూట్యూబ్‌లో చూసిన తరువాత నాకు కూడా ధైర్యం వచ్చింది. రీల్స్, వీడియోలు చేయడానికి ఎక్కడికీ పోనవసరం లేదు.. మన ఇల్లు, పొలాలే స్టూడియో అనుకొని పనిలోకి దిగాను. ఎంతోమంది మెచ్చుకోవడం సంతోషంగా ఉంది.
ఫ ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్’ చేస్తూ ఔరా అనిపించుకుంటున్న రంగ గౌరమ్మ
ఫ మనవరాలే గురువుగా డిజిటల్ పాఠాలు నేర్చుకున్న నిరక్షరాస్యురాలు
ఫ ఇల్లు, పొలాలే స్టూడియోగా వీడియోలు, రీల్స్
– రంగ గౌరమ్మ

ఇస్మార్ట్ బామ్మ!

ఇస్మార్ట్ బామ్మ!

ఇస్మార్ట్ బామ్మ!
Comments
Please login to add a commentAdd a comment