
వెళ్లొస్తాం.. లింగమయ్య
సూర్యాపేట/చివ్వెంల: ఐదు రోజుల పాటు సాగిన పెద్దగట్టు జాతర గురువారం మకరతోరణాన్ని సూర్యాపేటకు తరలించడంతో ముగిసింది. ప్రతి రెండేళ్లకొకసారి వచ్చే చివ్వెంల మండలం దురాజ్‌పల్లి శ్రీ లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర ఈనెల 16న ప్రారంభమై 20వ తేదీ వరకు వైభవంగా సాగింది. లక్షలాది మంది భక్తులు లింగమయ్యను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తులు, జోగినుల నృత్యాలు, డోలు చప్పుళ్లు, కటారు విన్యాసాలు, ఓలింగ నామస్మరణతో సంప్రదాయ పద్ధతిలో జాతర నిర్వహించారు.
మకర తోరణం ప్రత్యేకత
జాతర ప్రారంభానికి ముందు శ్రీ లింగమంతుల స్వామి అలంకరణ కోసం సూర్యాపేట నుంచి కోడి, వల్లపు వంశస్తులు తెచ్చారు. ఈ తోరణాన్ని తిరిగి ఊరేగింపుగా సూర్యాపేటకు తరలించారు. అదేవిధంగా లింగమంతుల స్వామి గుడిపైన ఉంచిన పసిడి కుండను దురాజ్‌పల్లి ఆవాసం ఖాసీంపేటకు చెందిన అలిశెట్టి వంశస్తులు జాతరకు ముందు తీసుకువచ్చి జాతర ముగియడంతో గురువారం తీసుకువెళ్లారు.
హుండీ ఆదాయం లెక్కింపు
చివ్వెంల(సూర్యాపేట): పెద్దగట్టు ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, కానుకలను గురువారం లెక్కించారు. 2023లో జరిగిన జాతరలో రూ.27,71,294 ఆదాయం రాగా.. ప్రస్తుతం రూ.31,29,686 వచ్చినట్లు ఆలయ ఈఓ కుశలయ్య తెలిపారు. గతంలో కంటే రూ.5.58 లక్షలు పెరిగినట్లు పేర్కొన్నారు. అదే విధంగా 425 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, తహసీల్దార్ కృష్ణయ్య, దేవాదా య శాఖ పరిశీలకురాలు సుమతి పాల్గొన్నారు.
విజయవంతంగా ముగిసిన జాతర
భానుపురి (సూర్యాపేట) : ఐదు రోజుల పాటు ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో మార్మోగిన పెద్దగట్టు జాతర గురువారంతో విజయవంతంగా ముగిసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటించారు. శ్రీలింగమంతులస్వామి జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా అధికారులు, ఆలయ పాలకవర్గం సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేశారని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంగా పని చేశాయని, పోలీసు శాఖ అత్యాధునిక సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణను విజయవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పర్యాటక ప్రదేశాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకున్నాయని తెలిపారు.
ఫ ముగిసిన పెద్దగట్టు జాతర
ఫ వైభవంగా మకరతోరణం తరలింపు
ఫ అధికారులు, పాలకవర్గ సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం

వెళ్లొస్తాం.. లింగమయ్య
Comments
Please login to add a commentAdd a comment