
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
భువనగిరి : 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ఈసారి ముందస్తుగానే పుస్తకాల సరఫరా ప్రారంభించింది. విడుతల వారీగా నెల రోజుల్లో పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని భువనగిరిలోని పాత గ్రంథాలయంలో భద్రపరుస్తున్నారు.
51,542 మంది విద్యార్థులు
జిల్లాలో 730 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక 484, ప్రాథమికోన్నత 68, ఉన్నత, జిల్లా పరిషత్ 163, కస్తూరిబా 7, మోడల్ స్కూళ్లు, గురుకులాలు 11 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 51,542 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి 5 నుంచి 11 పుస్తకాలు అవసరం.
రెండు విభాగాలుగా పుస్తకాల ముద్రణ
ఇంగ్లిష్, తెలుగు భాషల్లో పుస్తకాల ముద్రణ ఉండటంతో రెండు విభాగాలుగా సరఫరా చేస్తున్నారు. జిల్లాకు 3,90,170 పుస్తకాలు, 110 టైటిల్స్ ఇండెంట్ పెట్టారు. ఇందులో మొదటి విడత ఎస్‌ఏ–1 పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు 2 లక్షలు రావాల్సి ఉంది. ఇందులో ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం పుస్తకాలు వస్తున్నాయి. వీటిని ఓ పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్‌లో ముద్రించారు. 3నుంచి 10వ తరగతి వరకు క్యూ ఆర్ కోడ్ ముద్రించారు. ప్రస్తుతం 27,960 పుస్తకాలు, 8 టైటిల్స్ జిల్లాకు చేరాయి.
నెల రోజుల్లో పూర్తి స్థాయిలో వస్తాయి
రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు రావడం ప్రారంభమైంది. ఈనెల 11వ తేదీ నాటికి 27,960 పుస్తకాలు, 8 టైటిల్స్ వచ్చాయి. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో పుస్తకాలు జిల్లాకు చేరుతాయి. వీటిని పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పంపిణీ చేస్తాం.
– సత్యనారాయణ, డీఈఓ
3.90 లక్షల పుస్తకాలకు ఇండెంట్
జిల్లాకు చేరినవి 27,960
పాఠశాలల పునఃప్రారంభం
రోజున విద్యార్థులకు పంపిణీ