
మానవత్వం చాటుకున్న ‘మాచన’
శాలిగౌరారం: పుట్టుకతో దివ్యాంగుడైన ఆ బాలుడి తండ్రి కొన్నేళ్ల క్రితం పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఆ సమయంలో రెండేళ్ల వయస్సున్న అతడిని తల్లి వదిలేసి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఆ బాలుడిని తాతయ్య, నానమ్మ, బాబాయి చేరదీసి సాకుతున్నారు. వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు శనివారం నల్లగొండ కల్టెరేట్‌కు రాగా.. వీరి పరిస్థితి తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వైద్య పరంగా ఆ బాలుడిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వివరాలు.. శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన ముక్కాంల సృజన్ పుట్టుకతో దివ్యాంగుడు. సృజన్ తండ్రి 2019 మే 11న గొర్రెలను మేపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. అప్పుడు సృజన్ వయస్సు రెండు సంవత్సరాలు. భర్త మృతిచెందడం, కుమారుడు దివ్యాంగుడు కావడంతో సృజన్ తల్లి అతడిని తాతయ్య, నానమ్మ వద్ద వదిలిపెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో సృజన్ అనాథగా మారాడు. దివ్యాంగుడైన సృజన్‌ను తాత, నానమ్మ ముక్కాంల భిక్షమయ్య, సత్తమ్మతో పాటు బాబాయి నరేశ్ సాకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వికలాంగుల పింఛన్ రాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు శనివారం సృజన్‌ను తీసుకొని నానమ్మ సత్తమ్మ, బాబాయి నరేశ్ కలిసి నల్లగొండ కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టరేట్‌లో విధి నిర్వహణలో ఉన్న పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వారిని గమనించి అల్పాహారం తినేందుకు సృజన్‌ను పిలిచాడు. సృజన్ నడవలేడని, తల్లిదండ్రులు కూడా లేరని బాబాయి నరేశ్ రఘునందన్‌కు తెలిపాడు. దీంతో చలించిపోయిన రఘునందన్ సృజన్‌కు ఉచితంగా వైద్యం చేయిస్తానని నానమ్మ, బాబాయికి హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌లో ఉన్న న్యూ లైఫ్ హోమియోకేర్ వైద్యుడు గద్దె సుభాష్‌చందర్‌తో ఫోన్‌లో మాట్లాడి సృజన్ పరిస్థితిని వివరించాడు. దీంతో సోమవారం హాస్పిటల్‌కు రావాలని వైద్యుడు సూచించడంతో.. రఘునందన్‌కు సృజన్ నానమ్మ కృతజ్ఞతలు తెలిపింది. దివ్యాంగుడైన సృజన్ పరిస్థితి చూసి చలించి సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాచన రఘునందన్ తెలిపారు.
దివ్యాంగుడైన బాలుడికి ఉచితంగా
వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన
పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్