మళ్లీ తెరపైకి ‘రాచకొండ’ రిజర్వాయర్లు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి ‘రాచకొండ’ రిజర్వాయర్లు

Published Wed, Apr 30 2025 5:18 AM | Last Updated on Wed, Apr 30 2025 5:18 AM

మళ్లీ

మళ్లీ తెరపైకి ‘రాచకొండ’ రిజర్వాయర్లు

సంస్థాన్‌ నారాయణపురం: రాచకొండ ప్రాంతంలో రిజర్వాయర్లు నిర్మించి శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్‌ల ద్వారా ఆ ప్రాజెక్టులను నింపుతామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం సంస్థాన్‌ నారాయణపురంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ప్రకటించారు. యాద్రాది భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో రాష్ట్ర రాజధానికి చేరువలో రాచకొండ ప్రాంతం విస్తరించి ఉంది. సంస్థాన్‌ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలో ఒకటి, చౌటుప్పల్‌ మండలం దేవలమ్మ నాగారంలో మరొక రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధవుతున్నాయి. ఈ రిజర్వాయర్ల నిర్మాణంపై నల్లగొండలో జరిగిన ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విన్నవించారు.

నీళ్లు ఉంటేనే రాచకొండ అభివృద్ధి..

హైదరాబాద్‌కు అతి చేరువులో యాద్రాది భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో సుమారు 35వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతం రాచకొండ. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములున్నాయి. ఈ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం, ఫిలింసిటీ, స్పోర్ట్స్‌ సిటీ, ఎడ్యుకేషన్‌ హబ్‌, స్మార్ట్‌ సిటీ, పవన విద్యుత్‌ ఉత్పత్తి లాంటివి ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ఈ మేరకు రోడ్డు నిర్మాణాలు చేపట్టడానికి కూడా ప్రతిపాదనలు చేశారు. కానీ ఈ ప్రాంతంలో సరైన నీటి వసతి లేక ప్రతిపాదనలు మూలనపడ్డాయి.

రైతుల్లో చిగురిస్తున్న ఆశలు..

ఓ వైపు ఫ్లోరైడ్‌తో, మరోవైపు సాగుజలాలు లేక బీడు భూములుగా మారిన చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభా, కరువు పరిస్థితులు భవిష్యత్‌ అవసరాలకు రిజర్వాయర్లు ఎంతో దోహదం చేస్తాయి. రాచకొండలో ప్రకృతి అందాలతో ఉన్నప్పటికి వేసవి కాలం వస్తే మోడుబారిన చెట్లు కనిపిస్తాయి. ఇక్కడ రిజర్వాయర్లు నిర్మిస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందాడానికి అవకాశం ఉంది. రాచకొండ అటవీ ప్రాంతంలోని మూగ జీవాల దాహార్తి కూడా తీరుతుంది. రిజర్వాయర్ల నిర్మాణంతో బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని, భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఈ ప్రాంత స్వరూపం, ఇక్కడి ప్రజల జీవనశైలి కూడా మారిపోనుంది.

ఫ చౌటుప్పల్‌ మండలం దేవలమ్మ నాగారంలో ఒకటి, నారాయణపురం

మండలం రాచకొండ ప్రాంతంలో మరొకటి నిర్మించాలని యోచన

ఫ శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్‌ల ద్వారా ఈ రిజర్వాయర్లు నింపాలని ప్రభుత్వం ప్రతిపాదన

ఫ ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల

సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

ఫ పదేళ్ల క్రితమే రాచకొండలో 4

రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వే

చేసిన అప్పటి ప్రభుత్వం

రిజర్వాయర్‌ నిర్మించి నీళ్లు ఇవ్వాలి

గత కొన్నేళ్లుగా రాచకొండ ప్రాంతంలో రిజర్వాయర్లు నిర్మిస్తామని చెబుతున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదు. ఇక్కడ రిజర్వాయర్లు నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్లు అందించి రైతుల కష్టాలు తీర్చాలి. వర్షాలు వస్తేనే పంట దిగుబడి లేకపోతే పంటలు ఎండి నష్టపోవడం మాకు పరిపాటిగా మారింది. ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఆచరణలో సాధ్యం చేయాలి.

– నాగులపల్లి సత్తయ్య, రైతు, ఆరెగూడెం,

సంస్థాన్‌ నారాయణపురం మండలం

10 సంవత్సరాల కిందటే సర్వే..

సాగు నీటి అవసరాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాచకొండ ప్రాంతంలో 4 రిజర్వాయర్లు నిర్మించాలని పదేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం ఆలోచన చేసింది. నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్లు నిర్మించాలని హైదారాబాద్‌ జలమండలి అధికారులు, నిపుణులు మూడుసార్లు రాచకొండ ప్రాంతంలో పర్యటించారు. 40టీఎంసీల నీటిని నిల్వ చేయడమే లక్ష్యంగా సంస్థాన్‌ నారాయణపురం మండలం రాచకొండలో 2, చౌటుప్పల్‌ మండలం డి.నాగారం చెరువు వెనుక భాగంలో ఒకటి, మల్కాపురం శివారులో మరొకటి రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రాథమికంగా 5వేల ఎకరాల భూమి అవసరమని అంచనాలు రూపొందించారు. రాచకొండ గుట్టల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్‌ సమగ్ర నివేదికను రూపొందించే బాధ్యతలను వ్యాప్కోస్‌ సంస్థకు అప్పగించింది. నివేదక ఆధారంగా రూ.1,960కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. నివేదిక మూలనపడింది.

మళ్లీ తెరపైకి ‘రాచకొండ’ రిజర్వాయర్లు1
1/1

మళ్లీ తెరపైకి ‘రాచకొండ’ రిజర్వాయర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement