తమ్ముడూ.. ఏం తక్కువ చేశామురా నీకు.. - | Sakshi
Sakshi News home page

తమ్ముడూ.. ఏం తక్కువ చేశామురా నీకు..

Published Wed, Apr 19 2023 9:25 AM

- - Sakshi

వైఎస్సార్: కురబలకోట మండలం అంగళ్లులోని ఓ కళాశాలలో సీఎస్‌ఈ బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న మధు (21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. పీటీఎం మండలం అంగడివారిపల్లెకు చెందిన కుడుం ఉత్తన్న కుమారుడు మధు చదువుల్లో మేటి. పదిలో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. ఇంటర్‌లో కూడా రాణించాడు. అంగళ్లులోని ఓ కళాశాలలో ఇతనికి సీఎస్‌ఈలో ఫ్రీ సీటు వచ్చింది. తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సహ విద్యార్థులతో బాగా కలసిపోయే వాడు.

అంగళ్లులో రూము అద్దెకు తీసుకుని కళాశాలకు రాకపోకలు సాగించేవాడు. ఈనేపథ్యంలో ఈనెల 12న సాయంత్రం నుంచి కన్పించకుండా పోయాడు. రూముకు రాకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా చుట్టుపక్కల విచారించారు. సెల్‌ ఫోన్‌ కూడా రూములో వదిలి వెళ్లాడు. ఇతని ఆచూకీ కోసం కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. ఎక్కడైనా ఉంటాడులే అని భావి స్తూ వచ్చారు. మంగళవారం ఉదయం అంగళ్లులోని తుమ్మచెట్లపల్లె వద్ద ఉన్న కోల్డ్‌స్టోరేజీ వెనుక వైపు ప్రాంతంలో దుర్వాసన రాసాగింది.

స్థానికులు పరిశీలించి చూడగా కుళ్లిన స్థితిలో శవం కన్పించింది. మృతుడి దుస్తులు, చెప్పుల ఆధారంగా అదృశ్యమైన మధుగా గుర్తించారు. పక్కన టమాటా పంట వద్ద ఉన్న డ్రిప్‌ వైరుతో ఇతను చెట్టుకు ఉరి వేసుకున్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి స్పష్టమవుతోంది. ముట్టుకుంటే ఊడిపోయే పరిస్థితి కావడంతో డాక్టర్లు మంగళవారం సంఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

ఎందుకురా ఇలా చేశావ్‌..

ఇదిలా ఉండగా మధుకు తెలివైన విద్యార్థిగా పేరుంది. ఎవ్వరితో ఎలాంటి విబేధాలు లేవు. ఆర్థిక సమస్యతో స్నేహితులను ఇటీవల డబ్బు ఆడిగినట్లు చెబుతున్నారు.

దీనికి తోడు అంగళ్లుకు చెందిన మరొకరికి బాకీ ఉన్నట్లు సమాచారం. కొత్త అప్పు పుట్టక మరో వైపు చేసిన అప్పు తీరే మార్గం కన్పించక మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహితులు మాత్రం ఎందుకురా ఇంత పని చేశావని సంఘటన స్థలంలో కంట తడిపెట్టడం చూపరులను కలిచివేసింది. తమ్ముడూ.. ఏం తక్కువ చేశామురా నీకు.. మన కుటుంబంలో ఒక్కరూ చదువుకున్న వారు లేరు.. నువ్వన్నా ప్రయోజకుడవు అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాకున్నా లేకున్నా.. కష్టపడి చదివిస్తున్నాం కదరా.. ఎందుకిలా చేశావురా.. అంటూ మధు అన్నయ్య బోరున విలపించాడు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు రూరల్‌ సర్కిల్‌ సీఐ శివాంజనేయులు తెలిపారు. ఐపీఎల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు లేదా రుణ యాప్‌లు ఏమైనా ఈ సంఘటనకు దారి తీశాయా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement