సాక్షి ప్రతినిధి, కడప: ‘ప్రజల కష్టాలు తెలుసుకుందామంటే ప్రజలెవ్వరూ దరిదాపులకు రాలేదు. 14 ఏళ్లు అధికారం వెలగబెట్టినా ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. చెప్పుకునేందుకు చేసిన కనీస అభివృద్ధి లేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాలో యువగళం పాదయాత్ర విజయవంతం బాధ్యత ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలకు అప్పగించారు. అరువు తెచ్చిన జనాలతో రక్తికట్టించే జాగ్రత్తలైతే తీసుకున్నారు. కానీ హాజరైన వారినైనా ఆకట్టుకునే చర్యలకు ఉపక్రమించారా అంటే అదీ లేదు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సరిగా చదవడం రాలేదు.
వెరసి ఈవెనింగ్ వాక్‌ను మరిపించేలా యువగళం పాదయాత్ర కొనసాగింది. పక్షం రోజుల పాటు ఇక్కడ పర్యటించిన టీడీపీ నేత నారా లోకేష్ ఇక చేసేది.. చెప్పేది ఏమీలేక ‘ఆత్మస్తుతి..పరనింద’కు ప్రాధాన్యత ఇస్తూ తన పర్యటన ముగించుకుని వెళ్లారు. అధికారంలో ఉన్నప్పుడు నలుగురికి మంచి చేసినా, ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా ప్రజలు గుర్తు పెట్టుకోవడం సహజం. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 14 ఏళ్లు వైఎస్సార్ జిల్లా వివక్షకు గురైంది.
ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు హయాం మొత్తం జిల్లాకు చంద్రగ్రహణం పట్టిందనే చెప్పాలి. నిర్దిష్టమైన అభివృద్ధి చేపట్టకపోగా, పైగా జిల్లాపై, ఇక్కడి ప్రజానీకంపై విషం గక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఘటన చోటుచేసుకున్నా ‘కడప గూండాలు, పులివెందుల రౌడీలంటూ’ అభాండాలు వేస్తూ, ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారు. అధికారంలో లేనప్పుడు మాత్రం ఈ జిల్లాపై ‘మొసలి కన్నీరు’ కార్చడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ విషయంలో‘ పెదబాబు–చినబాబు ఇద్దరూ ఇద్దరే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు.
పాదయాత్రకు కొత్త భాష్యం...
ప్రజలు ప్రభుత్వం వద్దకు వెళ్లి వారి సమస్యలు చెప్పుకోలేని స్థితి, చెప్పుకున్నా పరిష్కారం లభించని పరిస్థితుల్లో నాయకులే ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం చూపించడం పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. అయితే నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కొత్త భాష్యం చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభించి, 10.30 గంటలలోపు ముగింపు పలికారు. ‘నాడు పెదబాబు రాత్రిళ్లు లాంతరు లైటింగ్‌లో పాదయాత్ర చేపట్టగా, నేడు చినబాబు ఈవెనింగ్ వాక్‌ను తలపించేలా జిల్లాలో పక్షం రోజులు తిరిగారు. ఇక ఏ నియోజకవర్గానికి వెళితే అక్కడ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేయడమే అసలు పనిగా పెట్టుకున్నారు. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపకపోగా బురదజల్లి పోవడమే లక్ష్యంగా ప్రసంగం కొనసాగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ అభివృద్ధి సాధించామని చెప్పుకునేందుకు అవకాశం లేకపోవడంతో పదేపదే అనంతపురం జిల్లాలోని ‘కియా’ కార్ల పరిశ్రమ గురించి ఊదరగొట్టారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే..
యువగళం విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికాబద్ధంగా టీడీపీ పావులు కదిపింది. ఓవైపు జనాలను తరలించే భారాన్ని భరిస్తూనే, మరోవైపు నారా లోకేష్ అండ్ టీమ్‌కు ఖర్చులకు రోజుకు రూ.7లక్షల చొప్పున నియోజకవర్గ ఇన్‌చార్జిలు చెల్లించాల్సి వచ్చిందని వినికిడి. నారా లోకేష్ ‘జాలీ’గా యాత్ర చేస్తుంటే వ్యయ ప్రయాసలకు లోనైన ఇన్‌చార్జిల వైపు ‘జాలి’గా చూడటం పార్టీ శ్రేణుల వంతైంది. జమ్మలమడుగు మొదలుకొని ప్రొద్దుటూరు, మైదుకూరు, చెన్నూరు, సిద్దవటం, బద్వేల్ ప్రాంతాల్లో బహిరంగ సభల నిర్వహణకు కూడా పథకం ప్రకారం ఇరుకు సందులనే ఎంచుకోవడం విశేషం.
తండ్రికి తగ్గ తనయుడుగా..
అబద్ధాలు వల్లించడంలో తండ్రికి తగ్గ తనయుడుగా నారా లోకేష్ జిల్లాలో పేరు పొందారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కడప స్టీల్ ప్లాంట్‌ను చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని పొందుపర్చినా ఐదేళ్ల కాలంలో టీడీపీ సర్కార్ ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్న తర్వాత 2018 డిసెంబర్ 27న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామం వద్ద సీఎం హోదాలో చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. సరిగ్గా ఎన్నికలకు 3 నెలల ముందు శంకుస్థాపనతో సరిపెట్టారు. టీడీపీ సర్కార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కృషి చేస్తే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ పట్టించుకోలేదనే విమర్శలు నారా లోకేష్ చేయడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లు తీవ్రమైన కరోనా వైరస్‌ను ఎదుర్కొని ప్రజలను రక్షించుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండిపోయింది. తర్వాత ప్రఖ్యాత స్టీల్ ప్లాంట్ జేఎస్‌డబ్ల్యు సంస్థ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. పరిశ్రమ నెలకొల్పేందుకు అనువైన మౌలిక వసతుల కోసం రూ.725 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి వసతులు సమకూర్చింది. రూ.3300 కోట్ల పెట్టుబడితో తొలివిడత నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యు అధినేత సజ్జన్ జిందాల్ శ్రీకారం చుట్టారు. అలాగే జిల్లాలోని గండికోట, రాజోలి రిజర్వాయర్, నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు పట్ల కూడా నారా లోకేష్ అవగాహన లేమి స్పష్టంగా తేటతెల్లమైందని పలువురు వివరిస్తున్నారు.
బలోపేతం కాకపోగా.. వర్గాలకు ఆజ్యం...
నారా లోకేష్ యువగళం కార్యక్రమం వల్ల తెలుగుదేశం పార్టీకి బలం చేకూరకపోగా, వర్గ విభేదాలకు ఆజ్యం పోశారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఇన్‌చార్జి గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని ఆకాశానికెత్తి, మాజీ ఎమ్మెల్యేలు మల్లెల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డిలను నియంత్రించడంపై ఆయా నేతల అనుచరులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డితో ఏకాంతంగా చర్చలు జరపడం, టీడీపీ బహిష్కృత నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సాయినాథ్‌శర్మలను లోకేష్ టెంట్‌లోకి అనుమతించడంతో ఇన్‌చార్జిలు అటు పుత్తా నరసింహారెడ్డి, ఇటు పుట్టా సుధాకర్‌యాదవ్‌లు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కడపలో ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కుటుంబాన్ని నియంత్రించేందుకు కడప నేతలు ఏకమయ్యారని, నేతల మధ్య అనైక్యత స్పష్టంగా కన్పించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ఓ ప్రహసనంలా ముగిసిందనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment