కడప అర్బన్ : వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు చిన్ననాగిరెడ్డి గారి శ్రీనివాసులరెడ్డి (42) దారుణ హత్య కేసును జిల్లా పోలీసు యంత్రాంగం ఛేదించింది. కొన్ని రోజులుగా కీలక నిందితులు పక్కాగా వ్యూహం పన్నినట్లు స్పష్టమైంది. శ్రీనివాసులరెడ్డికి, ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డికి ఇద్దరికీ వెన్నుదన్నుగా నిలిచిన మరో కీలక వ్యక్తికి కూడా ఈ హత్యలో ప్రమేయం వుందని పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఆ వ్యక్తికి సంబంధించిన వ్యాపార సంస్థల వద్దనే రోజుల తరబడి కీలక నిందితుడు ప్రతాప్‌రెడ్డి, మరి కొంత మందితో గంటల తరబడి మంతనాలు చేసినట్లుగా పోలీసులకు సీసీ ఫుటేజీల ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతాప్‌రెడ్డి స్వగృహాంలో నిర్వహించిన సోదాలలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు ఛేదించడంలో ప్రమేయమున్న అందరిపైనా పోలీసులు నిష్పక్షపాతంగా, చట్ట పరిధిలో శిక్షించేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. శ్రీనివాసులరెడ్డి వ్యతిరేకుల ప్రమేయం, వ్యాపార లావాదేవిల్లో నెలకొన్న వివాదాలు, భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం.
గురువారం రాత్రి మట్టుబెట్టేందుకు మాటు వేసిన ప్రధాన నిందితుడు
శ్రీనివాసులరెడ్డిని హత్య చేసేందుకు గురువారం రాత్రి కూడా మాటు వేసినట్లు తెలుస్తోంది. ఒకప్పటీ అనుకూలమైన సహచరుడుగా ఉంటూ దాదాపు ఏడాదిగా దూరంగా ఉన్న ఎర్రముక్కపల్లెకు చెందిన గుంటీ నాగేంద్ర సమీప బంధువులచే శ్రీనివాసులరెడ్డిని డిన్నర్‌కు ఆహ్వానించారు. డిన్నర్ ముగించుకొని రాజీవ్‌మార్గ్ ప్రధాన రహదారిలో శ్రీనివాసులరెడ్డి వచ్చే అవకాశం ఉంటుందనే భావనతో.. సమీపంలో ప్రధాన నిందితుడు మాటు వేసి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్‌కు హాజరు కావడం, వెహికల్‌లో వెళ్లి రావడంతో హత్య పథక రచన అమలు చేయలేకపోయినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం మాటు వేసి, పక్కా ప్రణాళిక బద్ధంగా బుర్ఖాలు ధరంచి హత్యాకాండను అమలు చేశారు.
ప్రత్యక్ష, పరోక్ష సహకారంపై ప్రత్యేక దృష్టి
శ్రీనివాసులరెడ్డి హత్యలో ప్రత్యక్ష, పరోక్షంగా ప్రధాన నిందుతులకు సహకరించిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో ఓ వ్యాపారవేత్తతో ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డి చేపట్టిన లావాదేవిలపై కూపీ లాగినట్లు సమాచారం. హత్యాకాండలో పాల్గొన్న వారికి మృతుడు శ్రీనివాసులరెడ్డి మధ్య నెలకొన్న వివాదాలను సరిపోల్చుకుంటున్నారు. అయితే హత్య తర్వాత ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డికి సహకరించిన వ్యక్తులపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి స్కూటర్‌పై ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి ప్రతాప్‌రెడ్డిని తరలించినట్లు కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆపైన డయల్ 100కు సమాచారమిచ్చిన పిదప పోలీసులకు దొరికిపోయేలా చాకచక్యంగా వ్యవహరించినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, కడప ఒన్‌టౌన్ సీఐ ఎన్‌వి నాగరాజు, కడప రూరల్ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి ఈ హత్య కేసులో ఇప్పటికే కీలక ఆధారాలను, ప్రతాప్‌రెడ్డితోపాటు, ఇతర నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజులల్లో నిందితుల్ని మీడియా ముందు హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment