వైఎస్‌ఆర్‌సీపీ నేత హత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ నేత హత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌

Published Tue, Jun 27 2023 11:07 AM | Last Updated on Tue, Jun 27 2023 11:07 AM

వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిన్ననాగిరెడ్డిగారి శ్రీనివాసులరెడ్డి(42) హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. శ్రీనివాసులరెడ్డిని ఈ నెల 23న ఉదయం 8:10 గంటల సమయంలో కడప నగరం ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సంధ్యా సర్కిల్‌ సమీపంలో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు మోపురు ప్రతాప్‌రెడ్డితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద వున్న ‘పెన్నార్‌’ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులను తీసుకుని వచ్చి హాజరు పరిచారు.

ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ విలేకరులకు వివరాలు తెలియజేశారు. అరెస్టయిన వారిలో పెండ్లిమర్రి మండలం కొండూరుకు చెందిన ప్రధాన నిందితుడు మోపురు ప్రతాప్‌రెడ్డి ప్రస్తుతం కడపలో జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ వెనుకభాగాన ఓ ఇంటిలో నివాసం వుంటున్నాడు. రెండవ నిందితుడు కడప పాలెంపల్లికి చెందిన మేరువ శ్రీనివాసులు ప్రస్తుతం సాయిపేటలో నివాసం వుంటున్నాడు. మూడవ నిందితుడు కడప నగరంలోని పాతకడపకు చెందిన కల్లూరు సురేష్‌కుమార్‌ అలియాస్‌ ఫ్రాన్సిస్‌, కడప నగర శివార్లలోని పుచ్చలపల్లి సుందరయ్యకాలనీకి చెందిన బరకం హరిబాబు, కడప నగరంలోని శంకరాపురంలో నివాసముంటూ వార్డు వలంటీర్‌గా వున్న కోనేరు వెంకటసుబ్బయ్య, కడప నగరం పాతకడపకు చెందిన పత్తూరు భాగ్యరాణి వున్నారు.

గతంలో శ్రీనివాసులరెడ్డితో కలిసి ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసులు కడప చుట్టుపక్కలా, ఇతర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ఈ విషయంలో వారికి విభేదాలు తలెత్తాయి. ప్రతాప్‌రెడ్డితోపాటు మరో నిందితుడు మేరువ శ్రీనివాసులుకు శ్రీనివాసులరెడ్డి తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించాడని భావించారు. అంతేగాక కిరాయి హంతకులతో తనను అంతమొందించడానికి ప్రయతిస్తున్నాడని ప్రతాప్‌రెడ్డి భావించాడు. శ్రీనివాసుల రెడ్డి తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నాడని ప్రతాప్‌రెడ్డి భావించాడు. దీంతో శ్రీనివాసులరెడ్డిని హత్య చేసేందుకు తనతో పాటు వున్న మేరువ శ్రీనివాసులు, నిందితురాలు భాగ్యరాణి పరిచయం చేసిన మిగిలిన నిందితులతో కలిసి ప్రతాప్‌రెడ్డి పథకం పన్నాడు.

కల్లూరు సురేష్‌కుమార్‌ అలియాస్‌ ఫ్రాన్సిస్‌, బరకం హరిబాబు, వెంకటసుబ్బయ్యతో పరిచయం చేసుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ పథకంలో భాగంగానే ఈనెల 23న ఉదయం మోపురు ప్రతాప్‌రెడ్డి, సురేష్‌కుమార్‌ అలియాస్‌ ఫ్రాన్సిస్‌ బురఖాలు ధరించారు. తమతోపాటు మారణాయుధాలైన బాకు, కత్తిని, కొడవలిని తీసుకున్నారు. శ్రీనివాసులరెడ్డి కదలికలను గమనించారు. శ్రీనివాసులరెడ్డి రాబిట్‌ ఫిట్‌నెస్‌కు వెళ్లినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు కాపుకాశారు. అతను రాగానే మృతుడి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌ సైకిల్‌కు కోనేరు వెంకటసుబ్బయ్య తన మోటార్‌ సైకిల్‌ను అడ్డు పెట్టాడు. అప్పటికే బురఖాలు ధరించి కత్తులు చేతపట్టిన ప్రతాప్‌రెడ్డి, సురేష్‌కుమార్‌ అలియాస్‌ ఫ్రాన్సిస్‌ ఒక్కసారిగా శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు.

ఈ దాడిలో శ్రీనివాసులరెడ్డి ఛాతీకి, గుండెకు బలమైన గాయాలు కావడంతో కొంతదూరం వెళ్లి కుప్పకూలిపోయాడు. హత్య జరిగిన తరువాత మేరువ శ్రీనివాసులు అక్కడే వుండి గమనించసాగాడు. హరిబాబుతో ఫోన్‌లో మాట్లాడుతూ అతని మోటార్‌సైకిల్‌పై ప్రతాప్‌రెడ్డి, ఫ్రాన్సిస్‌ ఊరిబయటికి వెళ్లిపోయారని ఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, బురఖాను అక్కడే వదిలేసి వెళ్లారన్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులకు ఫ్రాన్సిస్‌ను పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించిన పాత కడపకు చెందిన భాగ్యరాణిని 109 (హత్యకు ప్రేరేపించడం) నేరం కింద అరెస్ట్‌ చేశారు. హత్యకు ఉపయోగించిన నాలుగు మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా కొంతమందిపై అనుమానాలున్నాయని, వారికి నోటీసులు ఇచ్చామని, మరికొంతమందిపై వారి నుంచి సమాధానాలు రావాలని ఎస్పీ పేర్కొన్నారు. కాల్‌ డీటైయిల్స్‌ ఆధారాలు, వాట్సాప్‌ చాట్‌లు, గూగుల్‌ టేక్‌ అవుట్‌ తదితర సాంకేతిక అంశాల ద్వారా వివరాలు రాబడుతున్నామనీ, ఎవరిపై అనుమానాలు వచ్చి నిరూపణ అయితే వారిని కూడా అరెస్ట్‌ చేస్తామన్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనదనీ ఎస్పీ అన్నారు.

ఆ మహిళ.. అందరికీ స్ఫూర్తిదాయకం
హత్య జరిగే సమయంలో ఓ మహిళ ధైర్యంగా కత్తిని అక్కడి నుంచి తీసిందని, సదరు మహిళను సన్మానిస్తామని ఎస్పీ తెలిపారు. పబ్లిక్‌లో ఇలాంటి సంఘటనలు జరిగేటపుడు పౌరులు తమవంతు బాధ్యతగా ప్రతిఘటించాలని కోరారు. కేసును తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, ఇంకా కొన్ని అనుమానాలు వు న్నాయని, అలాంటి వారిని కూడా అరెస్ట్‌ చేస్తామ న్నారు. హత్యలో ఎలాంటి రాజకీయం లేదని, హత్య కేవలం ప్రాపర్టీ, డబ్బుల కోసమే జరిగిందన్నారు. ఈ సంఘటనలో అవాస్తవాలు ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయని, అలాంటి వాటిపైన కూడా దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ కబ్జాకు కేసుకు సంబంధం లేదని, ఒకవేళ భూ కబ్జాకు సంబంధించి వుంటే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారని, అలాంటిదేమీ లేదన్నారు.

● ఈ హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేయడంలో కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్‌ ఆధ్వర్యంలో కీలకపాత్ర పోషించిన కడప ఒన్‌టౌన్‌ సీఐ ఎన్‌.వి నాగరాజు, కడప రూరల్‌ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, సిద్దయ్య, సైబర్‌క్రైమ్‌ ఎస్‌ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డి, ఏఎస్‌ఐ మల్లయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ ఎన్‌.వేణుగోపాల్‌, కానిస్టేబుళ్లు ఖాదర్‌హుసేన్‌, చంద్ర, నారాయణరెడ్డి, కిరణ్‌, బాషలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

స్వాధీనం చేసుకున్న బురఖా, సెల్‌ఫోన్‌లు, మారణాయుధాలు, మోటార్‌ సైకిళ్లు2
2/2

స్వాధీనం చేసుకున్న బురఖా, సెల్‌ఫోన్‌లు, మారణాయుధాలు, మోటార్‌ సైకిళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement