ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు మండలంలో దారుణ హత్య జరిగింది. నిద్రపోతున్న నాగేంద్రబాబు (30) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. శుక్రవారం వేకువజామున మండలంలోని కానపల్లెలో ఈ దారుణ సంఘటన జరిగింది.
రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపల్లె పంచాయతీలోని కానపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ఆకుమల్ల నాగేంద్రబాబు గ్రానైట్ ఫ్లోరింగ్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో పనికి వెళ్లిన అతడు గురువారం రాత్రి పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. మద్యం తాగిన సమయంలో అతడు ఇంట్లో కాకుండా పక్కనే ఉన్న అక్క గారింటికి వెళ్లి నిద్రించేవాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగొచ్చి పక్కనే ఉన్న మిద్దైపె నిద్రించాడు.
రక్తపు మడుగులో మృతదేహం..
తెల్లారినా భర్త కిందికి రాకపోవడంతో భార్య ఇమాంబీ నాగేంద్రను నిద్రలేపేందుకు శుక్రవారం ఉదయం మిద్దైపెకి వెళ్లింది. భర్త రక్తపు మడుగులో పడిఉండటం చూసి నిర్ఘాంతపోయింది. గట్టిగా కేకలు పెట్టడంతో బంధువులందరూ మిద్దైపెకి పరుగెత్తుకుంటూ వచ్చారు. నాగేంద్రబాబు హత్య గురైన విషయాన్ని పోలీసులకు తెలిపారు. రూరల్ ఇన్‌చార్జి సీఐ ఇబ్రహీం, ఎస్‌ఐ శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించారు. పోలీసు జాగిలం సంఘటనా స్థలంతో పాటు చుట్టు పక్కల ఉన్న రెండు వీధుల్లో కలియ తిరిగింది.
ఇంటి పరిసరాల్లో రక్తపు మరకలు
నాగేంద్రబాబు హత్యకు గురైన చోటు నుంచి ఇంటి పరిసరాల్లో రక్తపు మరకలు పడి ఉన్నాయి. హత్య కోసం వాడిన కత్తి నుంచి రక్తం కింద పడినట్లు పోలీసులు నిర్ధారించారు. రక్తపు మరకలు పడిన ఆనవాళ్లను బట్టి దుండగులు వెళ్లిన మార్గాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటిపైకి వెళ్లేందుకు విశాలమైన ప్రధాన ద్వారం ఉన్నా.. ఇంటి పక్కనే ఉన్న ఇరుకై న సందులో నుంచి దుండగులు మిద్దైపెకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులే నాగేంద్రను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
నాగేంద్ర పక్కనే అతడి అక్క కుమారుడు పడుకొని ఉన్నాడు. అతడు కూడా మద్యం సేవించి నిద్రించాడని, పైగా అతడికి చెవుడని బంధువులు తెలిపారు. హత్య జరిగే సమయంలో పెనుగులాట జరిగి ఉంటుందని.. నీకు వినిపించలేదా? అని పోలీసు అధికారులు అతన్ని ప్రశ్నించారు. తనకు వినిపించలేదని పోలీసులకు తెలిపాడు. నాగేంద్రబాబు ప్రవర్తన గురించి పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. శుక్రవారం వేకువ జామున హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న నాగేంద్రబాబు
నాగేంద్రబాబుకు నాలుగేళ్ల క్రితం పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఇమాంబీతో ప్రేమ వివాహం జరిగింది. మొదట్లో వీరి పెళ్లిని ఇమాంబీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కొన్ని రోజుల తర్వాత అందరూ కలిసిపోయారు. వారికి మూడు, రెండేళ్ల వయసు గల నందన, పురుషోత్తం అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఇమాంబీ ఇంట్లోనే చిల్లర కొట్టు నిర్వహిస్తోంది. భర్త మరణంతో భార్యా పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ఇమాంబీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment