మానవ మృగానికి మరణదండన పడింది. మానవత్వం మరచి కిరాతకంగా వ్యవహరించిన అతను తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రెండు నిండుప్రాణాలను బలిగొనడంతో.. న్యాయమూర్తి ఉరిశిక్షతోపాటు మూడు జీవిత ఖైదులు, జరిమానా విధించారు. ఒకహత్య పశ్చాతాపం కలిగించకపోగా, మరో హత్య చేశాడు. ఈ కేసును విచారణ చేసిన న్యాయస్థానం ఈ రెండు హత్య కేసుల్లో తీర్పును వెలువరించింది. వివాహేత బంధం కొనసాగిస్తున్న ఓ మహిళపై తలెత్తిన అనుమానం హత్యలకు దారితీసింది. కేసులను ఛేదించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. చివరకు బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది.
బి.కొత్తకోట : ఇద్దరిని హత్య చేసిన సయ్యద్‌మౌలాలీ (47)కి చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎస్.రమేష్ మంగళవారం ఉరిశిక్షతోపాటు మూడు జీవిత ఖైదులు, జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తంబళ్లపల్లె మండలం గోవిందువారిపల్లెకు చెందిన గంగులమ్మ(65) కుమార్తె సరళమ్మ(35). ఈమెకు ముగ్గురు కుమార్తెలు కాగా భర్త 8 ఏళ్ల క్రితం మృతి చెందడంతో తల్లి గంగులమ్మతో కలిసి ఇంటిలో ఉంటోంది. తమ కుటుంబానికి చెందిన భూమికి సంబంధించి సమస్య ఉండటంతో సరళమ్మ తరచూ తంబళ్లపల్లె తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిపోతుండేది.
ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె మండలం గంగిరెడ్డిగారిపల్లెకు చెందిన సయ్యద్‌మౌలాలి (47)తో సరళమ్మకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం అందరికీ తెలియడంతో ఏటిగడ్డతండా సమీపంలో కాపురం పెట్టుకున్నారు. నాలుగేళ్లుగా గ్రామానికి సమీపంలో రేకులషెడ్డును నిర్మించుకుని కాపురం ఉంటున్నారు. కాగా సరళమ్మ ఫోన్‌లో ఎవరో వ్యక్తితో మాట్లాడుతోందని అనుమానించి, ఎవరితోనూ మాట్లాడవద్దని చెప్పాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. సరళమ్మపై మరింత అనుమానం పెంచుకున్నాడు. 2020 సెప్టెంబర్ 29న వేరుశనగ పొలంలోకి పందులు రాకుండా సరళమ్మ, మౌలాలి కాపలా కాస్తూ మంచంపై పడుకున్నారు. ఈ సందర్భంగా వేరే వక్తులతో ఎందుకు మాట్లాడుతున్నావని సరళమ్మను మౌలాలి ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
కోపంతో మౌలాలి కట్టెతో సరళమ్మ ఎడమ పక్క కణితిపై కొట్టడంతో కింద పడిపోయింది. చనిపోయిందని నిర్ధారించుకుని మృతదేహాన్ని సమీపంలోని పెద్దేరు ప్రాజెక్టులోకి ట్యూబ్‌బ్‌పై తీసుకెళ్లి తేలకుండా బండరాళ్లను కట్టి నీటిలోకి పడేశాడు. మరుసటిరోజు ఉదయం కుమార్తె సరళమ్మ ఎక్కడని తల్లి గంగులమ్మ ప్రశ్నించగా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిందని మౌలాలీ నమ్మించే ప్రయత్నం చేశాడు. 2020 అక్టోబర్ 1న సరళమ్మ ఎక్కడుందని గంగులమ్మ గట్టిగా నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో అదే రోజు రాత్రి ఆమెకు మద్యం తాగించాడు. తర్వాత ఇంటిబయట నిద్రిస్తున్న గంగులమ్మను అర్ధరాత్రి దాటాక ఆమె చీర కొంగుతో గొంతు నులిమి చంపేశాడు.
చనిపోయిన గంగులమ్మ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి గంగచెరువు నీటిలో చెట్టు మొదలుకు చీరను కట్టి నీటిలో పడేశాడు. మరుసటి రోజు తల్లి, అవ్వ కనిపించకపోవడంతో మౌలాలిని సరళమ్మ కుమార్తెలు ప్రశ్నించగా కరోనా సోకి ఆస్పత్రికి వెళ్లారని నమ్మించాడు. అంతటితో ఆగక ముగ్గురు పిల్లలను కర్ణాటకలోని గౌనిపల్లెకు తీసుకెళ్లి అక్కడ అద్దె ఇంటిలో ఉంచి చంపేస్తానని బెదిరించాడు. ఈ హత్యలు జరిగిన తర్వాత పీలేరులోని ఏటిగడ్డ గ్రామానికి చెందిన బంధువులు గోవిందువారిపల్లెకు వచ్చి గుంగులమ్మ గురించి ఆరా తీయగా కనిపించలేదు. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి తంబళ్లపల్లె ఎస్‌ఐ సహదేవి అదృశ్యం కేసు నమోదు చేయగా.. విచారణలో హత్యలుగా వెలుగుచూడటంతో సీఐ సురేష్‌కుమార్ దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.
ఒక ఉరి, 3 జీవిత ఖైదులు
రెండు హత్యలపై తంబళ్లపల్లె పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేయగా, అప్పటి ములకలచెరువు సీఐ సురేష్‌కుమార్ దర్యాప్తు చేయగా, అప్పటి డీఎస్పీ రవిమనోహరాచారి కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. హతులు ఎస్సీలు కావడంతో హత్య, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో చిత్తూరు ఫస్ట్ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి ఎస్.రమేష్ నిందితుడు సయ్యద్‌మౌలాలీకి శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు చెప్పారని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.లోకనాథరెడ్డి తెలిపారు.
మొదట జరిగిన సరళమ్మ హత్య కేసులో జీవితఖైదు, ఇదే కేసులో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో మరో జీవితఖైదు విధించారు. సరళమ్మను హత్య చేసిన పశ్చాతాపం లేకపోగా ఆమె తల్లి గంగులమ్మను కూడా హత్య చేయడంతో ఈ కేసులో నిందితుడు మౌలాలికి మరణశిక్ష విధించారు. ఐపీసీ సెక్షన్ 201 కేసులో ఏడేళ్ల జీవిత ఖైదు విధించారు. కేసుల్లో ఐదు జరిమానాల కింద రూ.5 వేలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అత్యాచారం కేసులో జీవిత ఖైదు
తల్లి, కుమార్తెను హతమార్చిన సయ్యద్‌మౌలాలి ఓ బాలిక(15)పైనా అత్యాచారం చేశాడు. సరళమ్మ ముగ్గురు కుమార్తెల్లో ఒక బాలికపై అత్యాచారం చేశాడు. పిల్లలను కర్ణాటకలో ఉంచినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనిపైనా కేసు నమోదు చేసి విచారణ చేసిన డీఎస్పీ రవిమనోహరాచారి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై చిత్తూరు స్పెషల్ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి ఈ ఏడాది మార్చి 13న శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుడు మౌలాలి చనిపోయేంత వరకు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ..బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు.
తెప్పలపై కష్టాలు.. డీఎన్‌ఏ పరీక్షలు
సరళమ్మ మృతదేహాన్ని బండరాళ్లతో కట్టి పెద్దేరు ప్రాజెక్టులో వేయడంతో వెలికి తీసేందుకు పోలీసులకు రెండు రోజులు పట్టింది. ప్రాజెక్టులో నిండుగా నీళ్లు ఉండటంతో మృతదేహం ఎక్కడుందో కనిపెట్టేందుకు వ్యవసాయబోర్లకు వినియోగించే కెమరాలను ఉపయోగించారు. తెప్పలపై వెళ్లి కెమెరాలను నీళ్లలోకి పంపి శోధించారు. అప్పటికే చేపలు తినేసిన మృతదేహాన్ని వెలికితీశారు. గంగచెరువులోని గంగులమ్మ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసినా గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించారు. తర్వాత నిందితుడు మౌలాలి నివసించిన కర్ణాటకలోని గౌనిపల్లెలో దర్యాప్తు చేశారు. జంట హత్యలు, బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు నిర్ధారించి ఆధారాలు సేకరించడంతో మౌలాలిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment