రాయచోటిటౌన్ : తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో పాటు మరొక వ్యక్తి సాయం తీసుకుని భర్తను అంతమొందించింది. ఆ తర్వాత తన భర్త బాత్‌రూంలో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంబేపల్లె మండలం శెట్టిపల్లెకు చెందిన అంజి అలియాస్ ఆంజనేయులు నాయుడు రాయచోటి పట్టణంలో నివాసం ఉంటూ వీరబల్లె మండల కేంద్రంలో వీఆర్‌ఓగా విధులు నిర్వర్తించేవాడు. ఆయనకు భార్య నందిని, ఇద్దరు మగపిల్లలు సంతానం ఉన్నారు.
అయితే నందినికి గొర్లమొదివీడుకు చెందిన మహదేవపల్లె చిన్నప్పరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తన భర్తకు తెలియడంతో ఆమెను వారించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకొనేవి. తన భర్త తనను వేధిస్తున్నాడని ఎలాగైనా అంతమొందించాలని చిన్నప్పరెడ్డికి చెప్పింది. వెంటనే పథకం రచించారు. ఈనెల 9వ తేదీ శనివారం రాత్రి ఇంటికి రాగానే భోజనం వడ్డించింది. మజ్జిగలో నిద్రమాత్రలు కలపడంతో అతను భోజనం చేసిన కాసేపటికి మత్తులోకి జారుకున్నాడు.
ఇదే అదునుగా భావించిన నందిని అప్పటికే సిద్ధంగా ఉన్న చిన్నప్పరెడ్డి, అతని స్నేహితుడు గొర్లమొదివీడు గ్రామానికి చెందిన మహదేవపల్లె సురేంద్రారెడ్డితో పాటు తాను కూడా బెడ్‌రూంలోకి వెళ్లి ముఖంపై దిండు ఉంచి గట్టిగా అదిమి పట్టుకున్నారు. అయితే అంజి నిద్రమత్తు నుంచి లేచి తేరుకొని గట్టిగా కేకలు వేశాడు. ఆ సమయలో వారిమధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇక చేసేది లేక ముగ్గురు కలిసి బలవంతంగా అతని ముఖంపై దిండు వేసి గట్టిగా అదిమి పట్టుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఊపిరి ఆగిపోయింది. మృతి చెందాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే హత్య కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పరెడ్డి తన చేతులకు గ్లౌజులు ధరించాడు.
అలాగే పట్టణంలో సీసీ కెమెరాల కంటబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మృతుడి భార్య నందిని తన భర్త బాత్ రూంలో పడి చనిపోయాడని చెప్పి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టడంతో నిజాలు వెలుగు చూశాయి. హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, అర్బన్ ఎస్‌ఐ నరసింహారెడ్డిలకు రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ తులశీరాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment