కడప అర్బన్ : కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో తాటిచెర్ల లక్ష్మి (48) అనే మహిళను ఈనెల 22వ తేదీన రాత్రి రోకలి బండతో దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు ఆవుల రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు చిన్నచౌక్ సీఐ పి. నరసింహారెడ్డి మంగళవారం తమ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో తాటిచెర్ల లక్ష్మీ (48) ఓ ఇంటిలో అద్దెకు ఉంటూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమె భర్త నారాయణ స్వామి గతంలోనే చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వారికి తాము గతంలో నివాసం ఉండిన ముద్దనూరులోనే వివాహాలు చేసి, తన బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం కడపకు వచ్చింది.
జమ్మలమడుగు టౌన్ కన్నెలూరులో నివాసం ఉంటున్న అనంతపురం జిల్లా పుట్లూరు మండలం, సంజీవపురానికి చెందిన ఆవుల రామాంజనేయులుతో తాటిచెర్ల లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే అప్పటికే ఆవుల రామాంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం విషయం రామాంజనేయులు భార్యకు తెలియడంతో ఎక్కడ తన భార్య, పిల్లలు దూరమవుతారోనని అతను కొంతకాలం తాటిచెర్ల లక్ష్మి ఇంటికి వెళ్లలేదు. దీంతో లక్ష్మి ఆవుల రామాంజనేయులుకు ఫోన్ చేసి, నీ భార్య పిల్లలను వదిలేసి తన దగ్గరకు రాకపోతే మీ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తానని, పోలీసు కేసు పెడతానని బెదిరించింది.
దీంతో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 22న కడపకు వచ్చి తాటిచెర్ల లక్ష్మి ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి సమయంలో ఇద్దరు భోజనం చేసి, పడుకున్న తరువాత అర్థరాత్రి సమయంలో పథకం ప్రకారం లక్ష్మిని రోకలిబండతో తలపై, ముఖంపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు.
ఈ సంఘటన జరిగిన తరువాత రోజున పోలీసులకు సమాచారం వచ్చింది. హత్య సంఘటనను ఛేదించేందుకు కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్ పర్యవేక్షణలో చిన్నచౌక్ సీఐ పి. నరసింహారెడ్డి, ఎస్‌ఐలు పి. రవికుమార్, పి. తులసీనాగప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ జె. రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు పి.వి. శ్రీనివాసులు, ఏ. శివప్రసాద్, రంతుబాషాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సమగ్రంగా దర్యాప్తు చేపట్టి ఈనెల 25వ తేదీ సోమవారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment