
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బహిర్గతమవుతున్నాయి. నియోజకవర్గ బాధ్యులకు అధినేత చంద్రబాబు పర్యటన శిరోభారంగా మారింది. ఈనెల 19న రా...కదలిరా కార్యక్రమం కమలాపురంలో నిర్వహించ తలపెట్టారు. ఏర్పాట్ల కోసం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూరో సభ్యుడితో సహా నలుగురు ఇన్‌చార్జిలు డుమ్మా కొట్టారు. పొరుగు జిల్లాలకు చెందిన సమన్వయ నేతల ఎదుట కమలాపురం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఇక్కడ రద్దు చేసి కడపలో పెట్టుకోండంటూ నేతల మధ్య ఉన్న అనైక్యతను బాహాటపర్చారు.
► కమలాపురం టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రా...కదలిరా కార్యక్రమం కడప పార్లమెంట్ పరిధిలో ఏర్పాట్ల బాధ్యతను మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి అప్పగించారు. సమన్వయకర్తలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (నెల్లూరు), ఏరాసు ప్రతాపరెడ్డి (కర్నూల్) ఉన్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం కోసం చర్చించేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్‌చార్జిలు హాజరు కావాలని ముందస్తుగా సమాచారం ఉంది. మైదుకూరు, కమలాపురం, బద్వేల్ ఇన్‌చార్జిలు పుట్టా సుధాకర్, పుత్తా నరసింహారెడ్డి, రితేష్‌రెడ్డి హాజరయ్యారు. కాగా, నలుగురు గైర్హాజర్ కావడం విశేషం. చంద్రబాబు పర్యటన అంటేనే నేతలకు శిరోభారంగా మారింది. జిల్లాలో ప్రజలను సమీకరించడం టీడీపీ నేతలకు బహుకష్టంగా మారింది. దీంతో బాధ్యతలు భుజస్కందాలపై వేసుకునేందుకు ఆయా నేతలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
జ్వరం సాకు చూపెట్టిన నేతలు
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితోపాటు ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, పులివెందుల ఇన్‌చార్జిలు వరుసగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాధవీరెడ్డి, భూపేష్‌రెడ్డి, బీటెక్ రవిలు హాజరు కాలేదు. అనంతపురం, కర్నూలు, నెల్లూరు నుంచి సమన్వయకర్తలుగా ఉన్న నేతలు హాజరైనా జిల్లాకు చెందిన వారు గైర్హాజరయ్యారు. ఫోన్‌లో వాకబు చేస్తే జ్వరం కారణంగా హాజరు కాలేదన్న సమాధానం ఆయా నేతల నుంచి వచ్చినట్లు సమాచారం. అందరికీ ఒక్కసారిగా జ్వరం వస్తుందా...కావాలనే హాజరు కాలేదని, ప్రోగ్రామ్ విఫలం చేయాలని ఉన్నారని కమలాపురం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి ఆయా నేతలపై ఆరోపణలకు దిగినట్లు తెలుస్తోంది. ఒకదశలో చంద్రబాబు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రమైన కడపలో పెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆయా ఇన్‌చార్జిలతో పర్సనల్‌గా మాట్లాడుతామని పుత్తాను శాంతింపజేస్తూనే, చంద్రబాబు కార్యక్రమం విజయవంతం చేసేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, దేవగుడి శివనాథరెడ్డి, మైనార్టీ నేతలు అమీర్‌బాబు, ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment