శోభాయాత్రలో భక్త జన సందోహం (ఇన్‌సెట్) 18 అడుగుల రాముడి భారీ విగ్రహం
కడప కల్చరల్: కడప నగరంలో శ్రీరామ శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. అయోధ్య ఐక్యతా వేదిక ఆధ్వర్యంలో 8 గంటలపాటు కొనసాగిన ఈ యాత్ర రాత్రి 10 గంటలకు ముగింపు వేదిక వద్దకు చేరుకుంది.ఆద్యంతం కళారూపాల ప్రదర్శనలతో అట్టహాసంగా సాగింది. ధార్మిక సంస్థలు అడుగడుగునా మంచినీరు, కూల్‌డ్రింక్స్, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశాయి. అయోధ్య ఆలయంలో సోమవారం శ్రీ బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్న సందర్భంగా ఆదివారం కడప నగరంలో శ్రీరామ శోభాయాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ తదితర ధార్మిక సంఘాలతోపాటు పలు దేవాలయాల నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు, భజన బృందాలు, అర్చక సంస్థలు, హిందూ సంఘాల ప్రతినిధులు దాదాపు 30 వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు.
► ఉదయం 7.30 గంటలకు చిన్నచౌకులోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి శ్రీరామ శోభాయాత్ర ప్రారంభమైంది. నగర మేయర్ సురేష్‌బాబు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్లు భక్తులతో నిండిపోయాయి.18 అడుగుల భారీ శ్రీరాముని విగ్రహాన్ని ప్రత్యేక రథంలో ఏర్పాటు చేశారు. ర్యాలీలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాహుబలి హనుమంతుడు, దేవతామూర్తుల వేషధారణలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. డీజే సౌండ్ సిస్టమ్‌తో భక్తిగీతాలకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నృత్యాలు చేయడం విశేషం.
బాలరాముని చిత్రం
ఆశారేఖ ఫౌండేషన్ చైర్మన్ నెమలిదిన్నె నాగవేణి బృందం స్థానిక హరిత టూరిజం హోటల్ ప్రాంగణంలో రూపొందించిన బాలరాముని రంగుల చిత్రం యాత్రలో పాల్గొన్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వైవీయూలో చిత్రకళను అభ్యసించిన విద్యార్థి కల్యాణ్ ఈ చిత్రాన్ని గంటసేపట్లో తీర్చిదిద్దారు.
నేటి కార్యక్రమాలు
సోమవారం హౌసింగ్‌బోర్డు రామాలయం వద్ద ఉదయం 6 గంటలకు శ్రీరామ హోమం, శ్రీరామలక్ష్మణ సీతా ఆంజనేయుల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహిస్తారు. అయోధ్యలో జరిగే రామప్రతిష్టను ఆలయంలో స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్‌లో భక్తులు చూసే అవకాశం కల్పిస్తున్నారు. అదేరోజు సాయంత్రం పాలకొండపై శ్రీరామ అఖండ దివ్యజ్యోతిని వెలిగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment