ఎన్నికలు సమీపించే కొద్దీరెచ్చిపోతున్న తెలుగుతమ్ముళ్లు
సంక్షేమ పథకాలు తొలగిస్తే వలంటీర్ల కాళ్లు చేతులు నరుకుతామని హెచ్చరిక
స్వయంగా వెల్లడించిన కమలాపురం ఇన్‌చార్జీ పుత్తా నరసింహారెడ్డి
నేడు మాజీ టీడీపీ నేత సాయినాథశర్మపై పుత్తా అనుచరులు ప్రత్యక్ష దాడి
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జిల్లాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రజామెప్పుతో విజయం సాధించాలనే తపన లేకపోవడమే అందుకు కారణమవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఓడిస్తాయనే అభద్రతాభావం మరోవైపు వెంటాడుతోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వలంటీర్లపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. జిల్లాలో తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యక్ష బెదిరింపులు,భౌతికదాడులకు దిగుతున్నారు. క్రమం తప్పకుండా ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి.
కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి వరుసగా నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు. మరోమారు ప్రజాతీర్పు కోరేందుకు సన్నద్ధయయ్యారు. ప్రజల మన్నలు పొందాల్సిందిపోయి, బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపితే, అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల కాళ్లు చేతులు నరుకుతామని హెచ్చరించారు. వాస్తవంలో కులం, మతం, పార్టీలు, వర్గాలతో నిమిత్తం లేకుండా అర్హులందరీకి సంక్షేమ పథకాలు అందిస్తామని బాధ్యతలు తీసుకున్న తొలిరోజే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అక్షరాల అదే ఆచరణలో చూపెట్టారు. ఈపరిస్థితుల్లో ఎవ్వరి సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశమే లేదు.
కాకపోతే పుత్తా నరసింహారెడ్డి కాళ్లు చేతులు నరుకుతామనే బెదిరింపులకు పాల్పడడం వెనుక నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో భయోత్పాతం సృష్టించేందుకేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈఘటన మరువక ముందే ఆదివారం టీడీపీ మాజీ నాయకుడు సాయినాథశర్మపై పెద్దచెప్పలిలో పుత్తా చైతన్యరెడ్డి అనుచరులతో కలిసి ప్రత్యక్ష దాడికి తెగబడ్డారు. రాజకీయంగా గత కొంతకాలంగా కొరకరాని కొయ్యగా సాయినాథశర్మ తయారు కావడమే అందుకు కారణంగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రధానంగా కమలాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు క్రమం తప్పకుండా తెరపైకి వస్తుండడం విశేషం.
అక్కసు వెళ్లగక్కిన ప్రవీణ్
వలంటీర్లపై ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల అక్కసు వెళ్లగక్కారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లును అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని కొట్టినట్లు వీధుల వెంబడి కొట్టుకుంటూ వెళ్తామని బాహాటంగా ప్రకటించారు. వాస్తవంలో వలంటీర్లు ప్రజా సేవకులుగా గుర్తింపు పొందారు. అలాంటి వారిపై అక్కసు వెళ్లగక్కడం వెనుక ప్రజాపోరాటంలో విఫలం కావడమేనని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వలంటీర్లు నుంచి కూడా టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కు ప్రతిఘటన ఎదురైంది. రంగస్థలంలో సినిమాలో నియంతగా వ్యవహరించిన జగపతిబాబును కొట్టినట్లు తరిమితరిమి ఎన్నికల్లో కొడతామని హెచ్చరికలు జారీ చేయడం విశేషం. కాగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జిల్లాలో ఉద్రికత్తలు క్రమేపీ అధికమవుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు మరింత చురుగ్గా పనిచేసి ఇలాంటి చర్యలను కట్టడి చేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment