ఏటా అన్న విగ్రహానికి రాఖీ కడుతున్న చెల్లెలు గాయత్రి
కడప కల్చరల్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఓ కుగ్రామంలో ప్రతి రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్య యుగంధర్ విగ్రహానికి రాఖీ కడుతున్నారు ఓ చెల్లి. అన్నయ్య మరణానంతరం ఆమె క్రమం తప్పకుండా ఆయన విగ్రహానికి రాఖీ కట్టి అన్నతో తనకు గల అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. విగ్రహానికి రాఖీనా? అంటూ కొందరు విచిత్రంగా చూసినా.. ఎగతాళిగా మాట్లాడినా ఆమె మాత్రం ఈ పద్ధతిని వదలడం లేదు. భౌతికంగా లేకపోయినా అన్నయ్య తన హృదయంలో ఎప్పటికీ సజీవంగానే ఉన్నారని సోదరి గాయత్రి పేర్కొంటారు.
ఒంటిమిట్ట మండలం రాచపల్లె గ్రామానికి చెందిన సరోజనమ్మ, కొండూరు జయరామరాజు కుమారుడు లాన్స్ నాయక్ కె.యుగంధర్ ఆర్మీలో ఉంటూ వీరమరణం పొందారు. గ్రామస్తులు యుగంధర్ స్మారకార్థం స్వగ్రామం రాచపల్లెలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి చెల్లెలు గాయత్రి, తమ్ముడు విశ్వనాథ్ అన్న విగ్రహం వద్ద ఏటా రాఖీ పండుగ నాడు చిన్న సందడి చేస్తుంటారు. ఉదయాన్నే సోదరి గాయత్రి అన్నయ్య విగ్రహానికి రాఖీ కడుతుంటారు. దీన్ని అందరూ విచిత్రంగా భావిస్తున్నా తనకు ఎంతో ఆత్మ తృప్తి లభిస్తుందని అంటారు గాయత్రి. నేటి పరిస్థితుల్లో ఇది ఆదర్శంగానే నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment