రెవెన్యూ అధికారుల పనితీరు మెరుగుపడాలి
కడప సెవెన్‌రోడ్స్: రెవెన్యూ అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకుని అర్జీలను బాధ్యతాయుతంగా, జవాబుదారి తనంతో పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవనంలో జమ్మలమడుగు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వోలు, మండల సర్వేయర్లతో నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలని చెప్పారు. గ్రీవెన్స్‌సెల్ అర్జీలను ఆయా గ్రామాల వారీగా క్రోడీకరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం పీజీఆర్‌ఎస్ అర్జీలపై సమీక్ష నిర్వహిస్తోందని తెలిపారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. భూముల అంశంలో పారదర్శక విచారణ జరిపి పరిష్కరించాలన్నారు. రెవెన్యూ విచారణలు నిర్వహించే సందర్భంలో సర్వేయర్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి ప్రతి మండల స్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. అసైన్డ్ భూములు, ఆర్‌ఓఆర్, పట్టాదారు పాసుపుస్తకాలు, చట్టాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, పులివెందుల, జమ్మలమడుగు ఆర్డీఓలు చిన్నయ్య, సాయిశ్రీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment