
భారతీయ సంస్కృతికి ప్రతీక రామాయణం
కడప కల్చరల్ : రామాయణ మహాకావ్యం భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె.కృష్ణారెడ్డి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ‘తెలుగులో రామాయణాలు– సామాజిక దృక్పథం’ అనే అంశంపై జరుగుతున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో భాగంగా మంగళవారం ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ఒంటిమిట్ట కోదండరామాలయం ప్రధానార్చకులు వీణా రాఘవాచార్యులు అతిథులతో కలిసి రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రామాలయం లేని గ్రామం లేదని, అందులోని ప్రతి పాత్ర సందేశమిస్తుందన్నారు. సభాధ్యక్షుడు, ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ రామాయణాన్ని ఆధ్యాత్మిక గ్రంథంగా కాకుండా ఆధునిక సమాజానికి పనికొచ్చే గ్రంథంగా చూడాలన్నారు. ఈగ్రంథం మానవాళికి చేసే మేలు గురించి తెలియజెప్పేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని వివరించారు. సదస్సు సమన్వయకర్త, బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ రామాయణాన్ని వివిధ కవులు రచించారని, వారి రచనా దృక్పథంతో వెలువడిన వివిధ సామాజిక అంశాలను పత్రాల ద్వారా వెలుగులోకి తీసుకురావడం ఈ సదస్సు ఉద్దేశమన్నారు. కీలకోపన్యాసకులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కె.మలయవాసిని మాట్లాడారు. విశిష్ట అతిథి, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ , గౌరవ అతిథి స్వామి అనుపమానంద, ఆత్మీయ అతిథి, చిన్మయా మిషన్ సంచాలకులు స్వామి తురియానంద తదితరులు ప్రసంగించారు.
● అనంతరం జరిగిన సదస్సుల్లో దేశ విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు, సాహితీవేత్తలు నేరుగాను, అంతర్జాలంలోనూ పత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు భారతీయ నృత్య సంస్థాన్‌కు చెందిన 30 మంది నృత్య కళాకారులు ‘సీతారామ కల్యాణం’ నృత్యరూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి సభను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైవీయూ తెలుగుశాఖ అధ్యక్షురాలు ఆచార్య ఎంఎం వినోదిని, అధ్యాపకులు ఆచార్య టి.రామప్రసాద రెడ్డి, ఆచార్య పి.రమాదేవి, ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారతీయ సంస్కృతికి ప్రతీక రామాయణం
Comments
Please login to add a commentAdd a comment