అమ్మభాషకు అక్షర రూపమిద్దాం !
మదనపల్లె సిటీ : మనకు ఎన్ని భాషలు తెలిసినా మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగేది ఒక్క మాతృభాషలోనే. అలాంటి కమ్మనైన అమ్మభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందులో భాగంగానే వారి వారి మాతృభాషల పరిరక్షణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భాషలు కనుమరుగు కాకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా యునెస్కో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. నాటి నుంచి వారి వారి మాతృభాషలను గౌరవించుకుంటున్నారు. కనీసం 30 శాతం మంది వారి మాతృభాషలను నేర్చుకోకపోయినా.. మాట్లాడకపోయినా ఆ భాష ఉనికికే ప్రమాదమని హెచ్చరించింది.
గతం..
ఎంతో ఘనం
రాజులు, నవాబుల పరిపాలనలో రాజ్యమేలిన భాషలు తెలుగు, ఉర్దూ. ఈ భాషలు రానురాను ప్రాభవం కోల్పోతున్నాయి. నేడు పాలనలో, పాఠశాలల్లో, ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ మాతృభాషలు అటు తెలుగు, ఇటు ఉర్దూ అమలు అరకొరగానే ఉంది.
తెలుగు వెలుగు కోసం..
తెలుగు వెలుగు కోసం పాలకులు చొరవ చూపాలని తెలుగు భాషాభిమానులు సూచిస్తున్నారు. తెలుగుభాషా రక్షణ, భాషాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తెలుగు అభివృద్ధి సాధికార సంస్థను నిధులు, విధులతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
మాతృభాషల అభివృద్ధికి ఇలా చేయాలి..
● రాష్ట్ర స్థాయిలో అధికార భాష, ద్వితీయ అధికార భాష అయిన తెలుగు, ఉర్దూలను నిర్బంధంగా అమలు చేయాలి.
● గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో కూడా జరగాలి.
● ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి శాశ్వత భవనం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తెలుగు, ఉర్దూభాషాభివృద్ధికి వినియోగించాలి.
● పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు మాతృభాషలను నిర్బంధంగా అమలు చేస్తూ ప్రాథమిక స్థాయి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి.
● తెలుగు, ఉర్దూ అకాడమీలను, అధికారభాషా సంఘాలకు అధికారులు, నిధులు, విధులు ఇచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించి భాషాభివృద్ధికి కృషి చేయాలి.
● పోటీ పరీక్షలన్నింటినీ ఆంగ్లంతో పాటు తెలుగు, ఉర్దూ మాధ్యమ అభ్యర్థులకు 5 శాతం అదనపు మార్కులు కలిపి ప్రశ్నాపత్రాలను తెలుగు, ఉర్దూలో కూడా ఇవ్వాలి.
ద్వితీయ అధికార భాషగా
ఉర్దూను అమలు చేయాలి
రారష్ట్‌రంలోని 13 జిల్లాలలోనూ ఉర్దూను ద్వితీయ అధికార భాషగా అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నా అమలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. తెలుగుతో సమానంగా ఉర్దూలో కూడా కార్యాలయాల్లో ఉత్తర, ప్రత్యుత్తర కార్యక్రమాలు అమలు చేసి ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేయాలి. ఉర్దూ పాఠశాలలు, కళాశాలలు, డైట్‌లలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. ఒక జాతి మనుగడ వారు మాట్లాడే మాతృభాషపైన ఆధారపడి ఉంటుంది.
– మహమ్మద్‌ఖాన్, రూటా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మదనపల్లె.
జాతి మనుగడకు భాషే ఆధారం
అమ్మ ఉగ్గుపాలతో నేర్చుకు న్న భాషను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తెలుగువారైన మనందరిపైనా ఉంది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు మన తెలుగుభాష ను అందించాలి. ఒక జాతి మనుగడ, వారు మాట్లా డే మాతృభాషపైన ఆధారపడి ఉంటుంది. తెలుగుభాషాభివృద్ధిలో భాగంగా ఏర్పాటైన తెలుగు అకాడమీలను బలోపేతం చేయాలి. – టీఎస్‌ఏ కృష్ణమూర్తి,
ప్రముఖ నవలా రచయిత, మదనపల్లె.
అందరి బాధ్యత
అమ్మభాషలో ఉన్న కమ్మదనం ఇతర భాషల్లో ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విడవరాదు. ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా అందరూ సమిష్టిగా మాతృభాషాభివృద్ధికి చొరవ చూపాలి.
– వీఎం నాగరాజు,
మరసం సభ్యులు, మదనపల్లె.
తల్లిదండ్రుల పాత్ర కీలకం
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేటి తరం పిల్లలకు అమ్మభాషపై ఆసక్తి కలిగించేందుదకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక భాష విలసిల్లాలంటే దాన్ని మాట్లాడే వ్యక్తులు అధికంగా ఉండాలి. పరభాషలు నేర్చుకునే ప్రయత్నంలో అమ్మభాషకు అన్యాయం చేయకూడదు. – అంజలి,
ఉపాధ్యాయురాలు, మదనపల్లె.
నేడు అంతర్జాతీయ
మాతృభాషా దినోత్సవం
అమ్మభాషకు అక్షర రూపమిద్దాం !
అమ్మభాషకు అక్షర రూపమిద్దాం !
అమ్మభాషకు అక్షర రూపమిద్దాం !
అమ్మభాషకు అక్షర రూపమిద్దాం !
Comments
Please login to add a commentAdd a comment