కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి. ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ పై వామపక్షాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో మోడీ వికసిత్ భారత్ అంటూ బూటకపు మాటలు చెప్తుంటే, రాష్ట్రంలో బాబు విలవిల ఆంధ్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వారం రోజుల్లో పెట్టబోతున్నారని, ఈ బడ్జెట్లోట్‌లో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, పంట కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బాబు తరచూ రాష్ట్రంలో తమది ఎన్డీఏ కూటమి అని చెబుతున్నప్పటికీ విభజన చట్టం హామీల అమలుకు గాని, రాజధాని, పోలవరం నిర్మాణానికి గానీ కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేకపోయారన్నారు. గండికోట, మైలవరం, చిత్రావతి, సర్వరాయ సాగర్, వామికొండ, బ్రహ్మ సాగర్, వెలుగొండ తదితర చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా 100 టీఎంసీలు నిలువకు అవకాశం ఉన్నా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీరు లేక విలవిల పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ 2025 బడ్జెట్‌లో లేవన్నారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ, ప్రభుత్వ ఖర్చుల్లో కోతలు పెడుతోందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు ప్రతి బడ్జెట్‌లో కొంత తగ్గిస్తూ ఆ పథకాన్ని లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇదే జరిగితే గ్రామీణ పేదరికం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, బి.మనోహర్, వి.అన్వేష్, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎం.ఎల్ .న్యూ డెమోక్రసీ), సీపీఐ (ఎం.ఎల్ .లిబరేషన్), ఆర్.ఎస్.పి, ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment