తమకు మున్సిపల్ కమిషనర్ కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ కమిషనర్ తీరుపై కౌన్సిలర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా వార్డుల్లో పర్యటించే సమయంలో, వార్డుల్లో ఏవైనా పనులు చేపట్టే విషయంలో తమకు సంబంధం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని వాపోయారు. ఇదే అధికారపార్టీకి చెందిన వార్డుల్లో, మరికొన్ని వార్డుల్లో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను, నాయకులను తీసుకెళ్లడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తనపై కక్ష పూరితంగా నాలా యాక్ట్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. బద్వేలు పట్టణంలో ఇప్పటి వరకు ఎంత మంది నాలా యాక్ట్ నిబంధనలు పాటించారో సమాధానం చెప్పాలని వైస్ చైర్మన్ గోపాలస్వామి పట్టుబట్టారు. అజెండాకు సంబంధం లేని విషయాలపై సమావేశంలో చర్చించనని కమిషనర్ తెలపడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను పిలిచి బయటికి పంపిస్తానని కమిషనర్ సమావేశ హాలులోకి పోలీసులను పిలిపించడంతో మిగిలిన వైఎస్సార్‌సీపీ సభ్యులు కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేమైనా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్నామా, పోలీసులను పిలిచి వైస్ చైర్మన్‌ను బయటికి పంపించాలని చూస్తే మేము కూడా బయటికి వెళ్లిపోతామని మూకుమ్మడిగా లేచి నిలబడటంతో చేసేదేమీ లేక కమిషనర్ మిన్నకుండిపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి చాలా మంది లబ్ధిదారులు రూ.25 వేల ప్రకారం డబ్బు చెల్లించారని, వారికి న్యాయం చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్.వి.సాయిక్రిష్ణ సమావేశం దృష్టికి తీసుకురాగా దీనిపై సంబంధిత శాఖ అధికారులకు లేఖ రాశామని, వీలైనంత త్వరగా లబ్ధిదారులకు డబ్బు జమ అయ్యేలా చూస్తామని కమిషనర్ సమాధానమిచ్చారు. అలాగే తమకు 25 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న దుకాణాన్ని అధికార పార్టీ నాయకుల మాటలు విని తొలగించారని 27వ వార్డు కౌన్సిలర్ శీలిరమాదేవి కమిషనర్‌ను ప్రశ్నించారు. ఇదే విషయమై కొందరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కమిషనర్‌ను నిలదీశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించామని కమిషనర్ సమాధానమివ్వగా ... పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న ఎన్ని దుకాణాలను తొలగించారని ప్రశ్నించారు. వాటికి కూడా కమిషనర్ ఆదేశాలు తీసుకువస్తే తొలగిస్తామని సమాధానమిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. 22వ వార్డు పరిధిలోని ఎన్‌జీవో కాలనీలో విద్యుత్ స్తంభాలు రోడ్డు మధ్యలోనే ఉన్నాయని గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వార్డు కౌన్సిలర్ ప్రపుల్లారెడ్డి సమావేశం దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అనంతరం పోలీసుల రంగ ప్రవేశంతో అజెండాపై చర్చించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment