‘కాశినాయన’పై దాడికి సీమపై వివక్షే కారణమా ? | - | Sakshi
Sakshi News home page

‘కాశినాయన’పై దాడికి సీమపై వివక్షే కారణమా ?

Published Sun, Mar 16 2025 2:00 AM | Last Updated on Sun, Mar 16 2025 1:56 AM

కడప కల్చరల్‌ : కాశినాయన ఆశ్రమంపై దాడి చేసి అటవీ అధికారులు అక్కడి కొన్ని ముఖ్యమైన భవనాలను కూల్చివేయడానికి అధికారులు, రాజకీయ నాయకుల్లో రాయలసీమపైగల వివక్షే కారణమా అని రాయలసీమ ఆకాంక్షల పౌర వేదిక కోఆర్డినేటర్‌ అలవలపాటి రఘునాథరెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కన్నబిడ్డలు అన్నం పెట్టకపోయినా ఆశ్రమంలో ఎప్పటికీ అన్నం లభిస్తుందని కాశినాయన ఆశ్రమానికి రోజూ వందలాది మంది అనాథలు చేరుకుంటారన్నారు. కుల మత గోత్రాలను పట్టించుకోకుండా అన్నార్తులను ఆదుకుంటున్న ఇలాంటి ఆశ్రమాలకు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. ఈ కూల్చివేతకు అటవీ నిబంధనలు ప్రధాన కారణం కాదన్నారు. కూల్చివేత సమయంలో ఉండిన స్థితిని పునరుద్ధరించాలని, అందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు.

ఏపీజీబీ విషయంలో కూడా..

కాశినాయన ఆశ్రమం విషయంలో స్పందించినట్లే ఏపీజీబీ విషయంలో కూడా రాష్ట్ర మంత్రి లోకేష్‌ సరైన రీతిలో స్పందించి ఇకనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వేదిక కో ఆర్డినేటర్‌ రఘునాథ రెడ్డి కోరారు. రాష్ట్రంలో 4 గ్రామీణ బ్యాంకుల విలీనం తర్వాత పెద్ద బ్యాంక్‌ అయిన ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఉన్న కడపలోనే రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం కొనసాగాలని ఈ ప్రాంతంలో రాజకీయ అనుబంధాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఓపెన్‌ స్కూలు కో ఆర్డినేటర్‌

అక్రమాలపై విచారణ జరపాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : ఓపెన్‌ స్కూలు కో ఆర్డినేటర్‌ సాంబశివారెడ్డి అవినీతిపై విచారణ జరపాలని ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేశు యాదవ్‌ కోరారు. శనివారం కలెక్టరేట్‌ సభా భవనంలో రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూలు ఎడ్యుకేషన్‌ కె.శ్యామూల్‌కు వినతిపత్రం సమర్పించారు. సాంబశివారెడ్డికి అర్హత లేకపోయినా ఓపెన్‌ స్కూలు కో ఆర్డినేటర్‌గా అప్పటి డీఈఓ అనూరాధ నియమించారన్నారు. సుమారు ఆరు వేల మంది ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు రాశారని, ఒక్కొక్కరి వద్ద రూ. 5–8 వేలు సాంబశివారెడ్డి వసూలు చేశారని ఆరోపించారు. ఇలా రూ. 6 కోట్లు అక్రమంగా వసూలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నవీన్‌, నాయకులు నాగమల్లయ్య, అశోక్‌, సూర్యవంశీ, నాగార్జున, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న

పెట్రోలు, డీజిల్‌ నిక్షేపాల సర్వే

లింగాల : లింగాల మండలంలో డీజిల్‌, పెట్రోలు నిక్షేపాలను గుర్తించేందుకు అన్వేషణ కొనసాగుతోంది. రైతులకు తెలియకుండా వారి పొలాల్లో బోర్లు వేయబోమని కాంట్రాక్టర్లు మాధవరెడ్డి, సురేష్‌ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన అక్షయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థకు లేబర్‌ కాంట్రాక్టు పొంది ఈ అన్వేషణలో భాగంగా లింగాల, తొండూరు మండలాల్లో బోరుబావుల తవ్వకం నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఆ గ్రామాల వీఆర్‌ఓలకు, సర్పంచ్‌లకు తెలియజేసి దండోరా వేయించి రైతులకు తెలియపరుస్తామన్నారు. అయితే రైతుల బోరుబావుల సమీపంలో బోర్లు వేయడం జరగదని, బోరుకు బోరుకు మధ్య దూరాన్ని పాటించి రైతులకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటామని వీఆర్‌ఓ బాబు తెలిపారు.

గడ్డివామి దగ్ధం

బ్రహ్మంగారిమఠం : బి.మఠం –బద్వేలు రోడ్డులో నరసింహస్వామి ఆశ్రమం దగ్గర ఉన్న గోశాలలో శనివారం తెల్లవారు జామున గడ్డి వామికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అంతకు ముందు రోజు గోశాలకు సమీపంలో ఉన్న నివాసముంటున్న వారికి గోశాల నిర్వాహకులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. గడ్డి వామి దగ్ధంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోశాల నిర్వాహకులు తెలిపారు.

ఏఆర్‌ ఎస్‌ఐ సస్పెన్షన్‌

కడప అర్బన్‌ : కడపలోని పోలీస్‌ శాఖలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న ఐవీ రమణారెడ్డి (1824)ని సస్పెండ్‌ చేస్తూ కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయప్రవీణ్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలామంది నిరుద్యోగ యువత వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసుకున్నారు. దీంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. వారి ప్రాథమిక నివేదిక మేరకు కర్నూలు డీఐజీ ఆదేశించారు.

బ్యాంకు ఖాతా నుంచి రూ.4.89 లక్షలు కాజేశారు

బి.కొత్తకోట : గుర్తు తెలియని వ్యక్తి నుంచి మొబైల్‌కు వచ్చిన మేసేజ్‌ ఓపెన్‌ చేయగానే రూ.4.89 లక్షలు కాజేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. మండలంలోని నాయనబావికి చెందిన దాదం లోకనాథరెడ్డి మొబైల్‌కు గతనెల 14న ఓ మెసేజ్‌ వచ్చింది. దాన్ని చూసిన లోకనాథరెడ్డి క్లిక్‌ చేసి తెరిచాడు. గట్టు కెనరా బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.4,89,858 నగదు వేరే ఖాతాలకు బదిలీ అయిపోయింది.

‘కాశినాయన’పై దాడికి  సీమపై వివక్షే కారణమా ?   1
1/1

‘కాశినాయన’పై దాడికి సీమపై వివక్షే కారణమా ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement