
కరువు మండలాల ప్రకటనలో అన్యాయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కడప జిల్లాలోని పడమటి ప్రాంతాలను ప్రధానంగా మెట్ట ప్రాంత మండలాలను విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. మంగళవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 9 మండలాల్లో తీవ్ర కరువు, 1 మండలంలో సాధారణ కరువు ఉన్నట్లు మొత్తం పది మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే ఎలాంటి నీటి పారుదల సౌకర్యం లేని కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లోని మెట్ట (వర్షాధారం) మండలాలను ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కరువు మండలాల సంఖ్య పెరిగే కొద్దీ పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే కరువు మండలాలను తగ్గిస్తూ వస్తున్నాయని ఆరోపించారు. ఉచితంగా పశుగ్రాస విత్తనాలు, పశువుల దాణా మంజూరు చేయాలన్నారు. వలసలను నివారించేందుకు ఉపాధి హామీ దినాలను పెంచాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేసీ బాదుల్లా పాల్గొన్నారు.
పశ్చిమ మండలాలను విస్మరించారు..
కడప జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మండలాల్లో గత ఖరీఫ్, రబీ సీజన్‌లో అతివృష్టి, అనావృష్టితో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరిరెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని రైతు సంఘాలతో గాని, వివిధ పార్టీల ప్రతినిధులతో గాని మాట్లాడకుండా, జిల్లాలోని అన్ని మండలాలు పర్యటించకుండా, రైతాంగంతో మాట్లాడకుండా, జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన అరకొర సమాచారంతో కేంద్ర ప్రభుత్వ కరువు బృందం జిల్లాలోని 10 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. ఆ మండలాల్లో కడప జిల్లా పశ్చిమ మండలాలు ఏ ఒక్కటీ లేకపోవడం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు విలయతాండవం చేస్తున్నప్పటికీ, కేవలం పది మండలాలనే కరువు ప్రాంతాలుగా గుర్తించడం అన్యాయమన్నారు.

కరువు మండలాల ప్రకటనలో అన్యాయం