బి.కొత్తకోట : సీపీఐ శత వార్షిక వేడుకలను ఆదివారం బి.కొత్తకోటలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. స్థానిక జ్యోతిచౌక్ నుంచి మెయిన్‌రోడ్డు, దిగువబస్టాండ్, పంచాయతీ వీధి, బైపాస్‌రోడ్డు, రంగసముద్రంరోడ్డు మీదుగా ప్రదర్శన నిర్వహించారు. నారాయణ డప్పుకొట్టి ప్రదర్శనను ప్రారంభించారు. అంతకుముందు జ్యోతిచౌక్ చేరుకున్న నారాయణ ఇక్కడి సాదిక్‌బాషా బిర్యానీ హోటల్ వద్దకు వచ్చి సాధారణ వ్యక్తిలా గ్లాసుతో నీళ్లు తాగారు. వెనక్కి ఇస్తూ ఏం వండారు అని నిర్వాహకున్ని ప్రశ్నించగా బిర్యాని అని చెప్పడంతో కొద్దిగా అన్నం పెట్టమని ప్లేటులో తీసుకుని రుచి చూశారు. అక్కడే ఉన్న ఓ విలేకరి చికెన్ తినరా అని ప్రశ్నించగా తింటాను ఓ ముక్క పెట్టమని చెప్పి పెట్టించుకుని తిన్నారు. ర్యాలీ సందర్భంగా స్థానికులు ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపారు. నారాయణ ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటిలో సభ్యునిగా పనిచేస్తున్న కాలం నుంచి బి.కొత్తకోటతో అనుబంధం ఉంది. దీంతో పాతతరం సీపీఐ నాయకులను పేరుతో పలకరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర, ఉపపధాన కార్యదర్శి సలీంబాషా, ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి సాంబశివ, రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణప్ప, ప్రజానాట్యమండలి కార్యదర్శి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.