దీక్షలు విరమించండి
ప్రొద్దుటూరు రూరల్ : దీక్షలు విరమించి తరగతులకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్(ఏపీఎస్‌వీసీ) చైర్మన్ డాక్టర్ పి.వి. లక్షుమయ్య పశువైద్య విద్యార్థులకు సూచించారు. ఆదివారం మండలంలోని గోపవరం గ్రామ సమీపంలో ఉన్న పశువైద్య కళాశాల ఆవరణలో పశువైద్య విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీక్షలను విరమిస్తే పశువైద్య విద్యార్థుల తరపున ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. తరగతులు కోల్పోకూడదని, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పెంచిన రూ.10,500 స్టైఫండ్ మీకు సరిపోదని తనకు తెలుసునని ఇంకొంచం పెంచేందుకు తాను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం జీఓ విడుదల చేస్తుందని పేర్కొన్నారు. అందుకు పశువైద్య విద్యార్థులు మాట్లాడుతూ జీఓ వచ్చేంత వరకు దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. మిగిలిన పశువైద్య కళాశాలలైన గరివిడి, గన్నవరం, తిరుపతి విద్యార్థులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
ఏపీఎస్‌వీసీ చైర్మన్ డాక్టర్ లక్ష్మయ్య