విద్యుత్ తీగలు తెగి అరటి పంట దగ్ధం
లింగాల : మండలంలోని బోనాల గ్రామంలో విద్యుత్ తీగలు తెగి మంటలు చెలరేగి అరటి పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన రమేష్‌రెడ్డి అనే రైతు తన పొలంలోని చీనీ చెట్లను నరికివేసి పొలం గట్టుపైన వేశాడు. సోమవారం ఉదయం విద్యుత్ తీగలు తెగి ఎండిన చీనీచెట్లపై పడటంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల వేడికి సుమారు ఎకరా పొలంలో ఉన్న మూడు నెలల అరటి మొక్కలు కాలిపోయి సుమారు రూ.50వేలు నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చీనీ పంటలో దిగుబడి రాక వాటిని తొలగించి అరటి పంట సాగు చేస్తే ఇలా కాలిపోవడం బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తనకు న్యాయం చేయాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.