
రైతు వ్యతిరేక ప్రభుత్వమిది
కడప సెవెన్‌రోడ్స్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు–కరువు కవల పిల్లల్లాంటి వారని ఎద్దేవా చేశారు. కరువుతో రైతులు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చాలా ప్రాంతాల్లో పంటలు పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందని, కొన్ని ప్రాంతాల్లో సగం పంటలు చేతికి వచ్చాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి రైతులకు సరైన ప్రోత్సాహం లేనందువల్ల ఆత్మహత్యలు చేసుకో వాల్సిన దుర్గతి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రమం తప్పకుండా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేవారన్నారు. అన్నదాత సుఖీభవ పేరిట తాను రూ. 20 వేలు ఇస్తానంటూ ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు ఈ సంవత్సరం దాని ఊసే మరిచిపోయారని విమర్శించారు. జిల్లాలో శనగ, మినుములు, కంది, వరి, చెరుకు లాంటి ఏ పంటకు మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ యేడాది శనగ ఎకరాకు 3–4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందన్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ–క్రాప్ చేసుకోవాలని ఇంకా పలు నిబంధనలు విధించడం వల్ల రైతులు అదే ధరకు బయట వ్యాపారులకు విక్రయిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అరటి, ఎర్రగడ్డలకు సైతం మద్దతు కల్పించామన్నారు. చంద్రబాబు పాలనలో ఉద్యాన పంటలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. జిల్లాలో 42 డిగ్రీల ఎండ తీవ్రత ఉండడంతో మామిడి పూత, పిందె రాలిపోతోందని, ఈ పరిస్థితుల్లో మామిడి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంటల మద్దతు ధర కోసం బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు చేశారని, అవి కూడా ఏమేరకు విడుదల చేస్తారో తెలియడం లేదన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దిచెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. రైతు నాయకుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరిలో క్వింటాలు బుడ్డశనగ ధర రూ. 5100 నుంచి రూ. 5250 వరకు ఉండేదన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కల్లాల్లోనే వ్యాపారులకు విక్రయించుకున్నారని, ప్రస్తుతం ఐదు శాతం శనగలు కూడా రైతుల వద్ద లేవన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బాలయ్య, ఆ పార్టీ నాయకులు పులి సునీల్‌కుమార్, ఇలియాస్, మునిశేఖర్‌రెడ్డి, నాగేంద్ర, నాగేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లేదు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి