
మైదుకూరులో ఆలయ భూముల సర్వే
మైదుకూరు : మైదుకూరులో శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూములను బుధవారం దేవదాయ శాఖ అధికారులు సర్వే చేయించారు. పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఇటీవల కొందరు నిర్మించిన కాంప్లెక్స్ దేవాలయ భూముల్లో నిర్మించారని ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో బుధవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ భూమును పోలీసు బందోబస్తుతో సర్వే చేసి కొలతలు వేశారు. భీమేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్లు 1052/ఏ లో 1.98 ఎకరాలు, 1052/బీలో 1.83 ఎకరాలు, 1052/సీలో 0.65 ఎకరాలు, 1845లో 10.20 ఎకరాలు, 1031లో 6.22 ఎకరాలు, 1054లో 1.56 ఎకరాలు, 1054/బీలో 1.34 ఎకరాలు, 1087/ఏలో 2.10 ఎకరాలు ఉన్నాయని ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ విలేకరులకు తెలిపారు. కాగా బుధవారం కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారి బైపాస్ సమీపంలో కేసీ కెనాల్‌కు ఉత్తరం వైపున ఉన్న సర్వే నంబర్ 1052/ఏలోని 1.98 ఎకరాలను, 1052/సీలోని 0.65 ఎకరాలను సర్వే చేయించి గుర్తింపు రాళ్లను పాతించారు. 1052/బీలోని 1.83 ఎకరాలకు సంబంధించిన భూముల్లో నిర్మాణాలు చేసిన వారు అభ్యంతరం వ్యక్తం చేయడం, వాటిపై కోర్టుకు వెళ్లినట్టు తెలియడంతో ఆ సర్వే నంబర్‌లోని భూములను దేవదాయ శాఖ అధికారులు సర్వే చేయించలేదు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ భూముల్లో కొందరు నిర్మాణాలు చేపట్టడంపై ఇటీవల ఫిర్యాదులు రావడంతో భూములను గుర్తించేందుకు సర్వే చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ప్రొద్దుటూరు ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ రెడ్డి, మైదుకూరు ఈఓ ప్రసాద్ రావు, కడప ఇన్‌స్పెక్టర్ శివయ్య, సిబ్బంది పాల్గొన్నారు.