లగేజ్ మూటలు పడి వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ లారీ నుంచి లగేజ్ మూటలు దించుతుండగా ప్రమాదవశాత్తూ మీద పడి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కడప రామకృష్ణ నగర్‌కు చెందిన ఎం. విజయ భాస్కర్(40) ట్రాన్స్‌పోర్ట్ గోదాములో పనిచేస్తున్నారు. గురువారం లారీ నుంచి లగేజ్ మూటలు దించుతుండగా మూటలన్నీ అతడిపై పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి సోదరుడు నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు
వ్యక్తి అదృశ్యం – కేసునమోదు
ముద్దనూరు : మండల కేంద్రంలోని డీయన్.పల్లె రహదారిలో నివసిస్తున్న వెంకటాద్రి(47) అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. గత ఫిబ్రవరి 25న ఉదయం పది గంటల సమయంలో వెంకటాద్రి పనుల నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు గాలించారు. మార్చి 1వ తేదీన సెల్‌ఫోన్‌లో మాట్లాడిన అతడు అనంతరం ఫోన్ ఎత్తడం లేదని తెలిపారు. వెంకటాద్రి భార్య మంజులాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా ఆస్పత్రి మార్చురీలో గుర్తుతెలియని మృతదేహం
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సుధాకర్ (55) అనే వ్యక్తి అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు. అనారోగ్య కారణాలతో ఈ నెల 15న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఇతడి పేరు డి.సుధాకర్ అని ఐపీ రిజిస్టర్‌లో రాసి ఉంది. అతను మృతి చెందగా, కుటుంబీకులు ఎవరూ లేకపోవడంతో మృత దేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. వ్యక్తి బంధువులు ఆస్పత్రిలో సంప్రదించాలని మార్చురీ ఇన్‌చార్జి వరాలు తెలిపారు.
క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్షన్‌కు ఆరు నెలలు
మదనపల్లె : కుమారుడి చదువు కోసం క్యాస్ట్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటే.. తప్పుల సవరణ పేరుతో ఆరు నెలలుగా పత్రం ఇవ్వకుండా నిలిపివేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు హబీబ్ సాహెబ్ వివరాల మేరకు.. నిమ్మనపల్లె కందూరు రోడ్డుకు చెందిన బి.హబీబ్ సాహెబ్ షేక్(బీసీ–ఈ) కులానికి చెందిన వ్యక్తి. ఇతడికి బి.ఫహీమ్, బి.ఫాజిల్లా, బి.ఫరీద్ సాహెబ్ ముగ్గురు పిల్లలు. ఫరీద్ సాహెబ్ ఐదో తరగతి చదువు తున్నారు. నవోదయ విద్యాలయలో చేర్పించేందుకు క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరమవడంతో దరఖాస్తు చేసుకుని కావాల్సిన ధృవపత్రాలు జతపరిచాడు. నిమ్మనపల్లె రెవెన్యూ సిబ్బంది బీసీ–ఇకు బదులుగా ఇండియన్ ముస్లిం(ఓసీ)గా పేర్కొంటూ జారీ చేశారు. దీంతో హబీబ్, తాము షేక్(బీసీ–ఈ)కు చెందిన వారమని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని రెవెన్యూ అధికారులకు విన్నవించారు. మిగిలిన తన ఇద్దరు కుమారుల క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఫరీద్ అహ్మద్ స్కూల్ టీసీ చూపినా బీసీ–ఈ సర్టిఫికేట్ జారీ చేయడంలో అధికారులు జాప్యం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీ పంపి, క్యాస్ట్ సర్టిఫికెట్ సరిచేసేందుకు మూడు నెలలుగా నిమ్మనపల్లె తహసీల్దారు కార్యాలయం, మదనపల్లె సబ్ కలెక్టరేట్ చుట్టూ సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు మరోసారి ఫైల్ తెచ్చి ఇవ్వాల్సిందిగా కోరారన్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదానికి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
లగేజ్ మూటలు పడి వ్యక్తి మృతి