ప్రొద్దుటూరు క్రైం: బంగారు బిస్కెట్‌ను అతి తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి నకిలీ బంగారాన్ని అంటకట్టిన కేసులో వన్ టౌన్ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భావన గురువారం రాత్రి వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని దొరసానిపల్లె రోడ్డుకు చెందిన చిట్టిబోయిన కీర్తి జనరల్ స్టోర్ నిర్వహించేవారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు దంపతులమని చెప్పి వారు ఉంటున్న వీధిలో చేరారు. ఈ క్రమంలో వారు కీర్తితో పరిచయం పెంచుకున్నారు. తాము బెంగళూరులో బిల్టిండ్ పని చేస్తున్న సమయంలో బంగారు బిస్కెట్లు దొరికాయని, అందులో ఒక బిస్కెట్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కీర్తి తన భర్త రామకృష్ణకు తెలిపింది. బంగారు బిస్కెట్ మార్కెట్‌లో రూ. 25 లక్షలు వరకు అవుతుందని, అయితే మీకు మాత్రం రూ.5.20 లక్షలకే విక్రయిస్తామని నమ్మబలికారు. అనుమానం ఉంటే బిస్కెట్ నాణ్యతను పరీక్షించుకోజచ్చని ఒక బంగారు బిస్కెట్ ముక్కను ఇచ్చారు. దాన్ని కీర్తి దంపతులు మార్కెట్‌లో పరీక్షించగా నాణ్యత బాగున్నట్లు తేలింది. దీంతో కీర్తి దంపతులు బంగారు బిస్కెట్ కొనేందుకు ఆసక్తి చూపారు. మరుసటి రోజే రూ. 5.20 లక్షలు వారికి ఇచ్చి బిస్కెట్‌ను కొనుక్కున్నారు. గత నెల 23న నగలను తయారు చేయించుకునేందుకు వారు బంగారు దుకాణానికి వెళ్లారు. అయితే దాన్ని పరీక్షించిన స్వర్ణకారుడు నకిలీ బిస్కెట్ అని చెప్పాడు. మోసపోయామని భావించి కీర్తి దంపతులు 24న వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడైన పల్నాడు జిల్లా, ముప్పాల మండలం, మాదాల గ్రామానికి చెందిన బండారు నాగేశ్వరరావు పట్టణంలోని కళామందిర్ వద్ద అనుమానంతో తిరుగుతుండగా వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో భాగంగా మోసం చేసినట్లు అతను అంగీకరించాడు. ఇంకా ఈ కేసులో నిందితుడి భార్య బండారు ఏడుకొండలు, తుమ్మిశెట్టి రాము, తుమ్మిశెట్టి భవానీల ప్రమేయం ఉందని డీఎస్పీ తెలిపారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ సంజీవరెడ్డిపాల్గొన్నారు.