రామా.. సామాన్యుల బాధ కనుమా!
రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇక్కడ ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో అత్యంత కీలకఘట్టం ఏప్రిల్ 11న జరిగే దాశరథి కల్యాణం. కల్యాణం కనులారా తిలకించే భాగ్యం సామాన్య భక్తులకు దరిచేరేలా ఉంటుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో టీటీడీ ఎలా వ్యవహరిస్తుందనేది వేచిచూడాల్సిందే.
వీవీఐపీ, వీఐపీలకే పెద్దపీట వేసే క్రమంలో..
కల్యాణ వీక్షణకు వీవీఐపీ, వీఐపీలకు పెద్దపీట వేసే క్రమంలో సామాన్య భక్తులను దూరం చేస్తోందన్న అపవాదును టీటీడీ మూటకట్టుకోవాల్సి వస్తుంది. సామాన్య భక్తులు కూడా కనులారా వీక్షించే సౌకర్యం కల్పించాలని వినతులు వస్తున్నాయి. కనీసం కల్యాణం తర్వాత ఉత్సవమూర్తులను దగ్గ్గరగా దర్శించుకునే భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
● సామాన్య భక్తుల గ్యాలరీలు ఉన్నప్పటికీ, అవి కల్యాణ వేదికకు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి ఎల్‌ఈడీ స్క్రీన్‌లో మాత్రమే చూడాల్సి వస్తోంది. కేవలం కల్యాణ వేదికలో ఉన్నామన్న భావనతో ఉండాల్సి వస్తోంది. ఈ సారి 60 గ్యాలరీలు ఏర్పాటు చేయాలనే భావనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. భక్తులు మధ్యాహ్నం 2 నుంచి గ్యాలరీకి చేరుకుంటారు. ఈ ఏడాది భానుడి ప్రతాపం అధికంగా ఉంటోంది. కాబట్టి సౌకర్యాల కల్పనలో ఎలాంటి తప్పిదాలు తలెత్తినా.. టీటీడీ మరోసారి నిందలు మోయాల్సి వస్తుంది.
ప్రసాదాల కోసం పడరాని పాట్లు
రాములోరి కల్యాణం వీక్షించేందుకు వచ్చే సామాన్య భక్తులకు టీటీడీ అందజేసే ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాల విషయంలో ఎప్పుడూ తోపులాటలు జరుగుతున్నాయి. ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండేందుకు.. టీటీడీ గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూలు రెండు (25 గ్రాములు) ఇచ్చేందుకు టీటీడీ యోచిస్తున్నట్లు తెలిసింది. పంపిణీ కౌంటర్ల విషయంలో గందరగోళం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. గతంలో కన్నా అధిక సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేసే యోచనలో టీటీడీ నిమగ్నం కావాలి. అలా చేస్తే.. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ఉంటారు.
●సర్వాంగ సుందరంగా..
వచ్చే నెల 11న రాములోరి కల్యాణం
సామాన్య భక్తులకు కనిపించని భాగ్యం
టీటీడీకి సవాల్‌గా మారనున్న పరిస్థితి
కల్యాణ వేదికను పుష్పాలు, ఫలాలతో సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఉద్యానవన విభాగానికి ఆ బాధ్యతలను అప్పగించనున్నారు. అందుకు సంబంధించి సన్నద్ధం కావాలని టీటీడీ ఆదేశించినట్లు సమాచారం. కడప–రేణిగుంట జాతీయ రహదారి పక్కన విశాలమైన ఖాళీ స్థలంలో రూ.40 లక్షలతో ప్రధాన కల్యాణ వేదిక నిర్మించారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి శాశ్వత పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రూ.45 కోట్లతో కలశం ఆకృతితో నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. తొలివిడతలో రూ.17 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కల్యాణవేదిక రహదారి, ముఖద్వారాలు, జాంబవంతుని విగ్రహం, పలు సౌకర్యాలకు రూ.28 కోట్లకు పైగా వ్యయం చేశారు.
రామా.. సామాన్యుల బాధ కనుమా!