‘శుభకార్యం’పై విచారణ
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే వచ్చిన అతిథులకు పది కాలాల పాటు గుర్తుండి పోయేలా కార్యక్రమాలను చేపట్టడం సాధారణ విషయమే. అలాగే శుభకార్యమంటే ఊరికనే జరిగిపోదు. ఏర్పాట్లు ఘనంగా ఉండాలంటే.. అందుకు సరిపడా బడ్జెడ్ కావాలి. కాగా ఆయన ప్రధాన విభాగానికి చెందిన కీలక అధికారి. తన ఇంట్లో జరిగే కార్యక్రమానికి సిబ్బందికి నిధుల సేకరణతోపాటు విధులను కేటాయించడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు అందిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘డ్యూటీ చార్టు’ సిద్ధం చేసి..
వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలకమైన విభాగాలు ఉన్నాయి. అందులో అదొక విభాగానికి చెందిన జిల్లా కార్యాలయం. ఆ విభాగానికి చెందిన అధికారి ఇటీవల ఒక శుభకార్యం(వివాహ వేడుక) నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు. స్థాయికి తగ్గట్టే శుభకార్యక్రమాన్ని బాగా నిర్వహించారని హాజరైన అతిథులంతా మెచ్చుకున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఈ శుభకార్యక్రమం నిర్వహణపై ఇప్పుడొక సమస్య వచ్చింది. ఈ కార్యక్రమం నిర్వహణ తీరుపై ఎవరో సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం)కు ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారంటే.. ఈ కార్యక్రమం నిర్వహణకు ఆ అధికారే స్వయంగా ఒక జాబితాను తయారు చేశారు. ఫంక్షన్ హాల్, కేటరింగ్, ఇతర పనుల ఖర్చుల బాధ్యతను ఒక్కొక్కరికి కేటాయించారు. అలాగే కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఆహ్వానం పలకడంతోపాటు ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించడానికి కూడా తన కింద పని చేసే సిబ్బందికి బాధ్యతలు (డ్యూటీ) అప్పగించారు. అలా నిధులు.. విధులను చేపట్టే వారి జాబితాను ఆ అధికారి ‘డ్యూటీ చార్ట్’లా తయారు చేసి సంతకం కూడా పెట్టినట్లుగా సమాచారం. ఈ అంశాలను ఎవరో సీఎంఓకు ఫిర్యాదు చేశారు. దీంతో గడిచిన శనివారం నుంచి సీఎంఓ నుంచి ఇక్కడి కార్యాలయంలో పని చేసే సిబ్బందికి ఫోన్‌లు చేసి, వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఆ శాఖలో తీవ్ర దుమారం రేపుతోంది.
నిధులు.. విధుల కేటాయింపులు
ఓ విభాగం వైద్యాధికారి నిర్వాకం
సీఎంఓ నుంచి వివరాల సేకరణ