కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్)లో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈనెల 26వ తేది ఒంటిమిట్టలోని పారెస్ట్ గెస్ట్ హౌస్‌లో ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకూ ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ న్యాయమూర్తి వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి, సభ్యులు కె. రామమోహన్‌రావు, ఎస్.ఎల్ అంజనీ కుమార్, డబ్ల్యు. విజయలక్ష్మిలు హాజరై విద్యుత్ వినియోగదారుల నంంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. వినియోగదారులు తమ దీర్ఘకాలిక సమస్యలను రాతమూలకంగా తెలిపి పరిష్కారం పొందాలని కోరారు.
జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం
– టీడీజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి
కడప రూరల్ : వైఎస్సార్ కడప జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు సంఖ్యా బలం లేదన్నారు. అందువలన తాము జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, మాధవి రెడ్డి పాల్గొన్నారు.
రాములోరి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం బోర్డు సమావేశం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి 14వ తేది వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 9న హనుమంత వాహనం, 10న గరుడవాహనం, 11న సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణ జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.