ఏపీపీఎస్సీ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఏపీపీఎస్‌సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నాలుగు వివిధ రకాల నోటిఫికేషన్ సంబంధించిన పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లోని డీఆర్వో ఛాంబర్లో ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులైన శ్రీనివాసులు(సెక్షన్ ఆఫీసర్), షేక్ ఖాసిం వల్లి తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 25, 27 తేదీల్లో ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు , మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ల, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జరిగేలా చూడాలని సూచించారు. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో 3, చాపాడు మండల పరిధిలో 1, ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో 1 పరీక్షా కేంద్రంతో కలిపి మొత్తం 5 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఏపీపీఎస్సీ, లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైన్ అఫ్ డిపార్టుమెంట్లు(పోలీస్, మెడికల్, ఏపీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ పీడీసీఎల్ శాఖలు) సంబందిత అధికారులు పాల్గొన్నారు.
డీఆర్వో విశ్వేశ్వర నాయుడు