
ఉప సర్పంచ్ పదవి కోసం అరాచకం
ప్రొద్దుటూరు : కేవలం గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ పదవి కోసం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు, దౌర్జన్యం, అరాచకాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతిని రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం, శుక్రవారం జరిగిన సంఘటనలే ఇందుకు సాక్ష్యమని అన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా గురువారం తమ వార్డు సభ్యులను కార్యాలయంలోకి వెళ్లకుండా రాళ్లు విసిరి, మారణాయుధాలతో వెంబడించారన్నారు. శుక్రవారం టీడీపీ వార్డు సభ్యులు తమలో తాము కొట్టుకోవడం, కుర్చీలు విసిరేయడం, మినిట్స్ బుక్ చించడం జరిగిందన్నారు. ఫైనల్‌గా ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు నటింపజేశారన్నారు. గుండెపోటు వచ్చిన రామాంజనేయరెడ్డికి సంబంధించి అధికారులు ఎందుకు హెల్త్ బులెటెన్ విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఇదంతా వరద స్టంట్ అని విమర్శించారు.
టీడీపీకి ఒకరే వార్డు సభ్యుడు
గత ఎన్నికల సందర్భంగా గోపవరం గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లకుగాను ఒకరే టీడీపీ తరఫున ఎన్నికయ్యారని రాచమల్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం మరో ఐదుగురు వైఎస్సార్‌సీపీ నుంచి వరద వైపు వెళ్లారన్నారు. ఏవిధంగా చూసినా 14 మంది వార్డు సభ్యులు ఉన్న వైఎస్సార్‌సీపీకి ఉప సర్పంచ్ పదవి దక్కుతుందా.. ఆరుగురు ఉన్న టీడీపీ సభ్యులకు దక్కుతుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. రూ.3–4 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టినా తమ వార్డు సభ్యులెవరూ వరద వైపు వెళ్లలేదన్నారు. జరిగిన గొడవను బట్టి ఇలాంటి వరదరాజులరెడ్డిని ఎమ్మెల్యేగా తాము గెలిపించామా అని ప్రజలు విస్తుపోతున్నారన్నారు. తాను డబ్బు సంపాదించి ఇంటిలో పెట్టుకుంటున్నానని చెప్పిన ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సంపాదిస్తున్న డబ్బును గూట్లో పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నా నేటికీ ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా పోలీసు కేసులు నమోదు కాలేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్ యాదవ్, రాజుపాళెం మండలం వైఎస్సార్‌సీపీ కన్వీనర్ బాణ కొండారెడ్డి, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వరదపై మాజీ ఎమ్మెల్యే
రాచమల్లు ధ్వజం