
కాళీయమర్దనుడిగా కోదండ రాముడు
ఒంటిమిట్ట: ఏకశిలానగరిలో కొలువైన కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో జగదభిరాముడిని ముస్తాబు చేశారు. పట్టు వస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు గ్రామ వీధుల్లో విహరించారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన కోదండ రామ ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు.
అశ్వవాహనంపై ఒంటిమిట్ట విభుడు
రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్ముడు అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాది రూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి, తరించాలని ప్రబోధిస్తున్నాడు.