
రైల్వే లోకో పైలెట్లకు వసతుల కల్పన
ఎర్రగుంట్ల (జమ్మలమడుగు) : రైల్వే లోకో పైలెట్ అండ్ గాడ్స్ ఎనిమిది గంటల ప్రయాణం చేసి ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు రైల్వే ఏడీఆర్‌ఎం సుధాకర్ అన్నారు. ఆదివారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌లో ఉన్న రైల్వే రన్నింగ్ రూమ్‌ను ఆయన పరిశీలించి అక్కడ లోకో పైలెట్లకు ఉన్న సదుపాయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ ఆవరణలో 2022లో రూ.97 లక్షలతో గ్రౌండ్ ఫ్లోర్‌ను నిర్మించామన్నారు. ఇప్పుడు రూ.1.37 కోట్లతో మహిళలకు, పురుషులకు వేరువేరుగా అన్ని వసతులతో విశ్రాంతి గదిని నిర్మించామన్నారు. ఇక్కడ విశ్రాంతి గది, యోగ, లైబ్రరీ, లోకో పైలెట్లకు అవగాహన కోసం సూచనలు ఇచ్చే ప్రత్యేక గది ఏర్పాటు చేశామన్నారు.
అంతేకాక రూ.60 లక్షతో ఎర్రగుంట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని ఇది జూన్ నెలకు పూర్తి చేస్తామన్నారు. ఎర్రగుంట్ల రైల్వే రన్నింగ్ రూమ్‌లో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. లోకోపైలెట్లకు ప్రత్యేక వంట గది కూడా ఉందని, వారికి ప్రత్యేక మెను ప్రకారం భోజన సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీఈఈ వీరయ్య, చీఫ్ క్రూప్ కంట్రోలర్ సిద్దు సాహెబ్, ఏడీఈయన్ రాధాక్రిష్ణ, ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసులు, చీఫ్ లోకో ఇన్‌స్పెక్టర్ బాబాజాన్, ముధుసూదన్, వీఎస్ రాజు పాల్గొన్నారు.
రూ.60 లక్షలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం
రైల్వే ఏడీఆర్‌ఎం సుధాకర్