
ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం
రాజంపేట టౌన్ : ప్రచండ భానుడి భగభగలతో అల్లాడుతున్న వేసవిలో చల్లని పదార్థాలకు, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించే పదార్థాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపుతుండటంతో శరీరానికి చలువచేసే వివిధ పదార్థాలతో ప్రజలు సేద తీరుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా శరీరం డీహైడ్రేషన్ కాకుండా మజ్జిగ, కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు, పండ్ల రసాలు వంటివి వేసవి తాపాన్ని తీర్చుతున్నాయి. అయితే వేసవిలో తాటిముంజలకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి తాపాన్ని అధిగమించేందుకు, వేసవిలో శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారించి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన తాటిముంజలు (ఐస్ యాపిల్) విశేష ప్రాచుర్యం పొందాయి. తాటిముంజల సీజన్ ప్రారంభం కావడం, దీనికితోడు భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ముంజలకు డిమాండ్ ఏర్పడింది. కొంత మంది వ్యాపారులు వైఎస్సార్ జిల్లా వేంపల్లె నుంచి తాటిముంజలను రాజంపేటకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తాటిముంజలు శరీరంలో చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగివున్నందున ముంజల విక్రయాలు హాట్ కేకుల్లా సాగుతున్నాయి.
ఆరోగ్య ప్రదాయిని..
ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే తాటిముంజలు కల్తీలేని, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయిని అని వైద్యులు కూడా చెబుతున్నారు. ధర ఎక్కువైనా ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డజను నూరు రూపాయిల నుంచి నూట ఇరవై రూపాయిలకు విక్రయిస్తున్నారు. అనేక మంది ఇవి విక్రయించే ప్రాంతంలో వేచివుండి మరీ కొనుగోలు చేస్తున్నారు. లేతగా ఉండే వాటికి గిరాకీ ఎక్కువగా ఉంది.
అనేక ప్రయోజనాలు..
● తాటి ముంజల్లో విటమిన్లు, ఫాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు సోలెబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
● వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవితాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.
● తాటిముంజలు తినడం వల్ల శరీరంలో పేరుకున్న హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
● వేసవిలో ఏటా క్రమం తప్పకుండా తినడం ద్వారా చెడుకొలస్ట్రాల్ తగ్గించి, మంచి కొలస్ట్రాల్ వృద్ది చేస్తుంది.
● వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
● చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమటకాయల్ని నివారిస్తుంది.
తాటిముంజల్లో పుష్కలంగా విటమిన్లు
భానుడి ప్రతాపంతో హాట్ కేకుల్లా
తాటిముంజల విక్రయాలు
ఐస్ యాపిల్‌గా ప్రాచుర్యం
వ్యాపారం జోరుగా సాగుతుంది
ఎండలు ఎక్కువగా ఉన్నందున తాటిముంజల వ్యాపారం జోరుగా సాగుతోంది. మేము వేంపల్లె నుంచి తాటిముంజలను తీసుకొస్తున్నాము. కొంతమంది తాటిముంజలు ఎప్పుడు వస్తాయా అని వేచివుంటున్నారు. ఖర్చులన్ని పోను ఆశాజనకంగా మిగులుబాటు ఉంది.
– శివ, తాటిముంజల వ్యాపారి
పోషక విలువలు అధికం
వేసవిలో అధికంగా ఎండలు ఉండటం వల్ల మనిషి శరీరంలో నీటిని కోల్పోతాడు. అందువల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తుండాలి. తాటిముంజలు వేసవితాపాన్ని తీర్చడంతో పాటు పోషకాలను అందిస్తాయి. వీటిలో ముఖ్యంగా తేమ, కార్పోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు వంటి పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
– డాక్టర్ పాలనేని వెంకటనాగేశ్వరరాజు, సూపరింటెండెంట్,
ప్రభుత్వ ఆసుపత్రి రాజంపేట

ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం

ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం

ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం