
పాత కడప ఎస్సీల భూ సమస్యలు పరిష్కరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : పాత కడప ఎస్సీల భూ సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాత కడప ఎస్సీలకు 1993లో చిన్నచౌకు పొలం సర్వే నెంబర్లు 1045, 1046లలోని కొండ పోరంబోకు భూమిని అప్పటి అధికారులు పట్టాలు, పాసు బుక్కులు ఇచ్చారని తెలిపారు. అప్పటి నుంచి ఎస్సీలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అక్కడి కొంతమంది పెత్తందారులు ఆ భూములపై కన్నెసి అధికారుల వత్తాసుతో తప్పుడు పత్రాలు చూపిస్తూ ఎస్సీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. భూముల్లోకి వెళ్లనీయకుండా పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లినా అధికారులు సాచివేత ధోరణి అవలంబిస్తున్నారన్నారు. దళితులను వారి భూముల్లోకి వారు వెళ్లే విధంగా రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీపీ నాయకులు మగ్బూల్‌బాషా, లక్ష్మిదేవి, సుబ్బరాయుడు, తస్లీమ్, దళిత గిరిజన హక్కుల పోరాట సమితి నాయకులు వెంకటేశు, నిత్య పూజయ్య, శేఖర్, ఓబులేశు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.