
శభాష్.. ఆచార్యా!
పుస్తకాలు చేతబట్టి పాఠాలు వల్లెవేసిన పల్లెటూరి పిల్లాడు.. నేడు అవే పుస్తకాలు చేతబట్టి విద్యార్థులకు బోధిస్తూ..
తన పరిశోధనలతో దేశ, విదేశాల్లో ఖ్యాతినర్జిస్తూ పుట్టినగడ్డకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నాడు. తాజాగా రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో ఫెలోగా నియమితులు కావడంతో పాటు సంస్థ రాయల్‌సొసైటీ బ్యాడ్జిని అందుకున్నాడు. ఆయనే ఆచార్య సుధాకర్ రెడ్డి.
● కడప ఆచార్యుడు సుధాకర్ రెడ్డికి అరుదైన గౌరవం
● పలు పేటెంట్లు కై వసం
● దేశ, విదేశాల్లో పరిశోధన
కడప ఎడ్యుకేషన్: చింతకొమ్మదిన్నె మండలం గూడావాండ్లపల్లెకు చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన బుసిరెడ్డి మల్లారెడ్డి, మల్లమ్మల కుమారుడైన డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి ప్రాథమిక విద్య బయనపల్లె ఎస్.వి. హైస్కూల్‌లో పూర్తి చేశాడు. అనంతరం డాక్టర్ పండ్రా కోటేశ్వరమ్మ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఎస్.వి. డిగ్రీ కళాశాలలో డిగ్రీ, తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. అనంతరం తాను చదివిన ఎస్.వి. డిగ్రీ కళాశాలలోనే అధ్యాపకుడుగా ప్రస్తానం ప్రారంభించారు. ప్రస్తుతం కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్నారు.
పరిశోధనల్లో ఘనాపాటి..
డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి పరిశోధన రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయనకు రెండు యూకే పేటెంట్లు ఉండగా, 75 పైగా అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. 2008లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న ఈయన 2017లో ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారాన్ని అందుకున్నాడు. 2018లో ఎన్‌ఈఎస్‌ఏ ఫెలోగా పరిశోధనలో ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నాడు. అదే ఏడాది విశిష్ట ప్రొఫెసర్ అవార్డును, 2024లో జాతీయ అధ్యాపక అవార్డును అందుకున్నారు. అదే విధంగా నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ (న్యాక్) కమిటీ మెంబర్‌గా కూడా వ్యవహరించారు. ఏడీ ర్యాకింగ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల జాబితాలో భారతదేశం నుంచి ఎంపికై న అతికొద్ది మంది భౌతికశాస్త్రవేత్తలో ఈయన ఒకరుగా నిలిచారు. ఇప్పటివరకు ఈయన 101 జర్నల్స్, 3 పుస్తకాలు, కోట్లాది రూపాయలు విలువ చేసే 6 ప్రాజెక్టులు పూర్తి చేశారు.
రెండు పేటెంట్లు...
‘డివైజ్ ఫర్ కంట్రోలింగ్ ది స్టెమ్ బోరర్ ఇన్‌సెక్ట్ ఇన్ క్రాప్ మేనేజ్‌మెంట్’అన్న అంశంపై ఈయన పరిశోధన వ్యాసానికి 2025 జూలై 10వ తేదీన యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన కంప్ట్రాలర్ జనరల్‌ఆఫ్ పేటెంట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వారు పేటెంట్ సర్టిఫికెట్ (పేటెంట్ నెంబర్ 6377539) అందజేశారు. ఈ పరిశోధనల ద్వారా ఎల్‌ఈడీ, నూనెలను ఉపయోగించి కీటకాలను రెండు విధాలుగా ఆకర్షించడానికి వినూత్న పరికరాన్ని రూపొందించారు. అదే విధంగా వేస్ట్ హెచ్‌జీ బేస్డ్ ల్యాంప్స్ కలెక్టింగ్ డివైజ్‌పై చేసిన పరిశోధనకు గాను పేటెంట్ నెంబర్ 6404043ను 2024 నవంబర్ 22న పొందారు.
రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో ఫెలోగా..
ప్రపంచవ్యాప్తంగా 50వేల మంది సభ్యులుగా ఉండే రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో ఫెలోగా అవకాశం దక్కించుకున్న ఈయన తాజాగా సొసైటీ వారు మెటీరియల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో చేసిన ప్రతిభను గుర్తించి ఎఫ్‌ఆర్‌ఎస్‌సీ (ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ) అందించారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను, అదే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘రాయల్ సొసైటీ బ్యాడ్జి’ను డా. బుసిరెడ్డికి పంపడం విశేషం.
డాక్టర్ బుసిరెడ్డి
సుధాకర్‌రెడ్డి
పాఠాలు చెప్పిన అధ్యాపకులకే గైడ్‌గా..
తనకు డిగ్రీలో పాఠాలు చెప్పిన అధ్యాపకులు పి. గిరిధర్, భూషణ్‌రెడ్డిలకు.. తర్వాత కాలంలో ఆయనే వారికి గైడ్‌గా వ్యవహరించి పీహెచ్‌డీలు అందించారు. ఇప్పటి వరకు 8 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ గైడ్ వ్యవహరించి వారికి డాక్టరేట్ రావడంతో కృషిచేశారు. ప్రస్తుతం మరో ఇద్దరు పరిశోధకులు ఈయన వద్ద పరిశోధనలు చేస్తున్నారు. 2010లో తొలుత విదేశాల్లో పరిశోధనలు ప్రారంభించిన ఈయన ఇప్పటి వరకు సౌత్‌కొరియా, హాంకాంగ్, స్వీడన్, ఫిన్‌లాండ్, సౌత్ ఆఫ్రికా దేశాల్లో పరిశోధనలు చేశారు.

శభాష్.. ఆచార్యా!

శభాష్.. ఆచార్యా!