
కలిసి మెలిసి జీవిస్తేనే దేశాభివృద్ధి
కడప కార్పొరేషన్ : దేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయని, అందరూ కలిసి మెలిసి జీవిస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిఽథి గృహంలో దళిత ఫోరం ఛైర్మెన్ కిశోర్ బూసిపాటి ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. మతం ముసుగులో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ మతమైనా ఆచరించే హక్కు ఉందని, బలవంతంగా ఎవరినీ మతం మార్చకూడదన్నారు. దాడులపై శాంతి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దళిత ఫోరం జిల్లా ఛైర్మెన్ కిశోర్ బూసిపాటి మాట్లాడుతూ మతం పేరుతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకోవడం సమాజానికి, దేశానికి మంచిది కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేయడం దుర్మార్గమన్నారు. కమ్యునిస్టు నేత బి.నారాయణ మాట్లాడుతూ దేశంలో అంటరానితనం, వివక్ష ఉన్నప్పటికీ ఇటీవల ప్రభుత్వాలే దాడులకు పురికొల్పుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దళితులు, క్రిష్టియన్ మైనార్టీలపై దాడులను సమైక్యంగా ఎదుర్కొందామని వక్తలు తీర్మానించారు. అందరూ జేఏసీగా ఏర్పడి దాడులను ఎదుర్కోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులిసునీల్, సీహెచ్.వినోద్, వేణుగోపాల్‌నాయక్, చిన్నసుబ్బరాయుడు, బండిప్రసాద్, కె.బాబు, చిన్నయ్య, శ్యాంసన్, త్యాగరాజు, సంపత్, రత్నకుమారి, తులశమ్మ, సుశీలమ్మ, చైతల్య, మల్లీశ్వరి, పద్మ, వెంకటేశ్వర్లు, గుర్రప్ప, సీఆర్‌వీ.ప్రసాద్, జేవీ.రమణ, డా. పెంచలయ్య, 32మంది పాస్టర్లు పాల్గొన్నారు.
రాజ్యాంగం ప్రకారం
ఏ మతమైనా స్వీకరించవచ్చు
రౌండ్ టేబుల్ సమావేశంలో
రవీంద్రనాథ్‌రెడ్డి