
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
లింగాల : లింగాల మండలం వెలిదండ్ల గ్రామంలో విద్యుత్ షాక్‌తో నల్లపురెడ్డిగారి మేఘనాథరెడ్డి (42) అనే రైతు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. మేఘనాథరెడ్డి స్వగ్రామం సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామం. ఆయన చీనీ కాయల వ్యాపారం చేస్తూ వ్యవసాయ పనులు చేసుకునేవాడు. ప్రస్తుతం ఆయన పులివెందులలో నివాసముంటున్నాడు. వెలిదండ్ల గ్రామంలోని కర్ణా నాగార్జునరెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కర్ణా నాగార్జునరెడ్డికి ఒకే కుమార్తె కావడంతో ఆయన పొలాలను కూడా మేఘనాథరెడ్డి చూసుకునేవాడు. శనివారం మధ్యాహ్నం చీనీ తోటలోని పొలంలోకి వెళ్లి మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య కంగారుపడి బిదినంచర్ల, వెలిదండ్ల గ్రామాల బంధువులకు ఫోన్లు చేసి వివరాలను అడిగింది. వారు అనుమానంతో పొలంలోకి వెళ్లి చూడగా, మేఘనాథరెడ్డి విగతజీవుడై పడి ఉన్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు లింగాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, కుమార్తె, కుమారుడు ఉన్నారు.